మళ్లీ ఎదురు‘చూపు’లేనా?
ABN , First Publish Date - 2023-02-21T00:42:05+05:30 IST
జిల్లాలో రెండో విడత కంటి వెలుగు పథకంలోనూ లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగానే కనిపిస్తుంది.
నెల రోజుల్లో 1,08,771 మందికి కంటి పరీక్షలు
రెండో విడతలోనూ కరువైన శస్త్ర చికిత్సలు
9,395 మందికి ఆపరేషన్‌లు అవసరమని గుర్తింపు
దూరదృష్టి అద్దాల సరఫరాలో తీవ్ర జాప్యం
‘కంటి వెలుగు’పై సన్నగిల్లుతున్న ఆశలు
జిల్లావ్యాప్తంగా వంద రోజుల పాటు కొనసాగనున్న రెండో విడత కంటి వెలుగు పథకం
ఆదిలాబాద్, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత కంటి వెలుగు పథకంలోనూ లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ఓ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగానే కనిపిస్తుంది. గత నెల జనవరి 18న జిల్లా వ్యాప్తంగా 35 కేంద్రాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 468 గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో దశలవారీగా కంటి పరీక్షల శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా 1,08,771 మంది లబ్ధిదారులకు కంటి పరీక్షలు నిర్వహించగా, ఇందులో 18 నుంచి 39ఏళ్ల వయస్సు గల వారు 50వేల 165 మంది కాగా, 40 నుంచి 50ఏళ్ల లోపు లబ్ధిదారులు 31వేల 109 మంది, 50ఏళ్లకు పైబడిన వారు 27వేల 497మంది ఉన్నారు. కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం 15వేల 305 మందికి రీడింగ్ గ్లాసులను అందించగా.. మరో 15వేల 720 మందికి ప్రిస్కిప్షన్ (దూరదృష్టి, ఇతర లోపాలు)అద్దాలు అవసరమని అధికారులు గుర్తించారు. నెల రోజులు గడుస్తున్నా.. దూరదృష్టి, ఇతర కంటి లోపాల వారికి అద్దాలను అందజేయడంలో ఆలస్యం జరుగుతూనే ఉంది. మొదటి విడతలోనూ అధికారులు ఆలస్యం చేయడంతో అత్యవసర వైద్యం పేరిట కొందరు లబ్ధిదారులు ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వైద్యం చేయించుకున్న సందర్భాలు ఉన్నాయి. రెండో విడతలోనూ కంటి పరీక్షలు చేయడం నామమాత్రంగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మళ్లీ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈసారి వంద రోజుల ప్రణాళికను ఏర్పాటు చేసుకుని అధికారులు కంటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ సరైన సేవలు అందించకపోవడంతో కంటి వెలుగు పథకంపై ప్రజల్లో ఆసక్తి కరువవుతున్నట్లు కనిపిస్తుంది.
ఇక శస్త్రచికిత్సలు లేనట్లే..?!
ప్రభుత్వం చేపట్టిన రెండో విడత కంటి వెలుగు పథకం కింద అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయడం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా సుమారుగా 70 వేల మందికి శస్త్ర చికిత్సలు అవసరమని వైద్యులు గుర్తించినా.. ఏ ఒక్కరికి శస్త్ర చికిత్సలు చేయలేదు. దీంతో లబ్ధిదారులు నిరాశకు గురయ్యారు. అలాగే రెండో విడతలోనూశస్త్ర చికిత్సలు ఉండవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మొదటి విడతలో సాధ్యం కాక పోవడంతోనే రెండో విడతలో ప్రభుత్వం శస్త్ర చికిత్సల జోలికి వెళ్లడం లేదంటున్నారు. జిల్లాకేంద్రంగా కొన్ని ప్రైవేట్ కంటి ఆసుపత్రులను ఎంపిక చేసి అర్హులైన వారికి శస్త్ర చికిత్సలు చేయించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రీడింగ్, దూరదృష్టి వారికి అద్దాల అందజేత, ఇతర కంటి లోపాల వారికి ఉచిత మందుల పంపిణీ, సలహాలు, సూచనలకే అధికారులు పరిమితమవుతున్నారు. ఎక్కడా శస్త్ర చికిత్సల జోలికి వెళ్లడం లేదు. రెండో విడతలోనూ ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 9వేల395 మందికి శస్త్ర చికిత్సలు అవసరమని అధికారు లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. కాని ప్రత్యేకంగా కంటి వెలుగు కార్యక్రమంలో శస్త్ర చికిత్సలు ఉండవని అధికారులే చెబుతున్నారు. గతంలో మాదిరిగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి శస్త్ర చికిత్సలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో మళ్లీ లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
అరొకరగా అద్దాల సరఫరా
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమై నెల రోజులు గడిచి పోతున్నా.. ఇప్పటికీ అరకొరగానే కంటి అద్దాలు సరఫరా అవుతున్నాయి. రీడింగ్ గ్లాసులను అందజేస్తున్నా.. దూరదృష్టి, ఇతర కంటి లోపాల వారు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 15,305 రీడింగ్ గ్లాసులను అందజేయగా.. మరో 15,720 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు అవసరమని వైద్య అధికారులు గుర్తించారు. కానీ అందుబాటు లో మాత్రం కేవలం 300 కళ్లద్దాలే ఉన్నట్లు తెలుస్తుంది. మిగితా వారికి ప్రభుత్వం నుంచి సరఫరా కావాల్సి ఉంది. అంటే నెల రోజులు గడిచి పోతున్నా.. నామమాత్రంగానే కంటి అద్దాలను సరఫరా చేయడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజులు గడుస్తున్నా.. కంటి అద్దాలు రాకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు తీసి అవసరమైన కంటి అద్దాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండో విడతలో కళ్లలో శుక్లాలు, నల్లపాప మీద పొర, కళ్లద్దాలు, మోతియా బిందువు, నరంవల్ల అంధత్వం, చూపు లోపం, దూరదృష్టి, దగ్గర దృష్టి, కనుపాప పై పొర, నీటి కాసులు, మెల్లకన్ను లాంటి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.
శస్త్ర చికిత్సల కోసం ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నాం
: రాథోడ్ నరేందర్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్
శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి ప్రభుత్వ ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నాం. రెండో విడతలో ప్రత్యేకంగా శస్త్రచికిత్సలు ఉండవనే తెలు స్తుంది. ఎందుకంటే మొదటి విడతలోనే శస్త్ర చికిత్సల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ కారణంగానే శస్త్రచికిత్సలు చే సేందుకు ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ప్రస్తుతం అ వసరమైన వారికి రీడింగ్ గ్లాస్‌లను అందజేస్తున్నాం. అలాగే దూరదృష్టి, ఇతర లోపం ఉన్న వారికి కంటి అద్దాలను సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం 300 కంటి అద్దాలు అందుబాటులో ఉన్నాయి. మిగితా వారికి త్వరలోనే కంటి అద్దాలను అందజేస్తాం. కంటి సమస్యతో బాధపడుతున్న వారి కి అవసరం మేరకు కంటి అద్దాలు, మందులను ఉచి తంగా అందజేస్తున్నాం. తదుపరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే శస్త్రచికిత్సలపై నిర్ణయం తీసుకుంటాం.