ప్రాణాలు తీస్తున్న భూ వివాదాలు
ABN , First Publish Date - 2023-04-12T22:31:28+05:30 IST
జిల్లాలో భూ వివాదాలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లో భూముల ధరలు ఆకాశాన్నం టుతుండడంతో వివాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కే
- వివాదాస్పద భూములే లక్ష్యంగా ముందుకు
- ఎంతకైనా తెగిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు
- గ్యాంగులతో తిష్ఠవేస్తూ విలువైన స్థలాలు కబ్జా
మంచిర్యాల, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూ వివాదాలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండలాల్లో భూముల ధరలు ఆకాశాన్నం టుతుండడంతో వివాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనే ఆధారపడి వందల సంఖ్యలో మంది కోట్లకు పగడలెత్తుతున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పట్టా భూములు కొనుగోలు చేసి వెంచర్లుగా మార్చి ప్లాట్లు విక్రయించడం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక పద్ధతి. కాగా వెంచరు యజమానుల వద్ద వినియోగదారులచే ప్లాట్లు కొనుగోలు చేయిస్తూ కమీషన్లు అందుకోవడం ఇంకో పద్ధతి. ఈ రెండు వర్గాలు రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడి పని చేస్తుండగా, మూడో వర్గం వారు అందుకు భిన్నంగా సులువుగా డబ్బులు సంపాధించే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఈ వర్గానికి చెందిన వ్యక్తులు వివాదాస్పద భూముల్లో జోక్యం చేసుకోవడం ద్వారా తమ పబ్బం గడుపుకుంటున్నారు. రెండు పార్టీలను బెదిరింపులకు గురి చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు.
జిల్లా కేంద్రంతో పాటు..
భూముల ధరలు విపరీతంగా పెరిగిన జిల్లా కేంద్రంతోపాటు గద్దెరాగడి, నస్పూర్, మందమర్రి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో వివాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభు త్వ, పట్టా, నాలా స్థలాలు పెద్ద మొత్తంలో కబ్జాలకు గురవుతున్నాయి. ఆయా స్థలాలను అక్రమంగా ఆక్రమించుకుంటున్న వ్యక్తులు ఒకే సర్వే నంబరు పై ఉన్న స్థలాన్ని ఇద్దరు, ముగ్గురికి విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. ఒకే స్థలాన్ని పలువురుకి రిజిస్ట్రేషన్లు చేసిన సంఘటనలు చాలా వెలుగు చూశాయి. పట్టా ఒకరి పేరిట ఉంటే...రిజిస్ట్రేషన్లు మరొకరి పేరిట ఉంటున్నాయి. అలా ఒకే భూమిని ఇద్దరు, ముగ్గురికి అమ్మకానికి పెడుతుండడంతో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అసలు విషయం తెలుసుకున్న భూములు కొనుగోలు చేసిన వారు ఇదేంటని నిలదీస్తే బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా గ్యాంగులను మెయింటన్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్‌కు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అడ్డు వచ్చే వారిని బెదిరింపులకు గురిచేస్తూ, అవసరమైతే మట్టు బెట్టేందుకు కూడా వీరు వెనుకాడడం లేదు. ఈ పరిస్థితి ప్రస్తుతం మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నడిపెల్లి లక్ష్మీకాంతరావు ఈ నెల 11న ప్రత్యర్థుల చేతిలో మృత్యువాత పడ్డారు. ఇక్కడ కూడా ఒకే భూమిని ఇద్దరికి అమ్మడం వివాదానికి దారి తీసింది.
గిరిజన భూముల్లో పెద్దల పాగా..
మందమర్రి మండలం తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలో దాదాపు 150 ఎకరాల్లో ఈ వివాదాలు అనేకం ఉన్నాయి. గతంలో తిమ్మాపూర్ గ్రామంలో గిరిజన కుటుంబాలు ఉండేవి. కాల క్రమంలో ఉపాధి కరువై 40 సంవత్సరాల క్రితం వారంతా దేవాపూర్, కాసిపేట, తిర్యాణి, తదితర అటవీ ప్రాంతాలకు వలస వెళ్లారు. అక్కడ పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. గిరిజనులు వదిలిపెట్టినవి వారి సొంత పట్టా భూములు కావడంతో రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను వాటిపై పడింది. గిరిజనుల వారసుడిగా చెప్పుకుంటూ కొందరు అదే తెగకు చెందిన వారిని ఎరగా పెడుతూ ఎలాగోలా సదరు భూములను తమ పేర్లపైకి మార్పిడి చేసుకున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలు ఉండడంతో వందల ఎకరాల గిరిజనుల భూముల ఇతరుల పేరిట పట్టాలు మారాయి. ఆ భూములను ఆక్రమంగా సొంతం చేసుకున్న వారు ప్రస్తుతం వాటిని అమ్మకానికి పెడుతున్నారు. తిమ్మాపూర్ గ్రామంలో అమ్మకానికి ఉన్న భూములు ఒకరిద్దరి పేరిట రిజిస్ట్రేషన్లు అయి ఉన్నాయి. ఒకే భూమిని ఇద్దరు అమ్మకానికి పెడుతుండడంతో వివాదాలు చెలరేగుతున్నాయి. తిమ్మాపూర్ శివారులోని సర్వే నంబర్లు 1,2,6,7,8,9,11,151,153,185,331 నుంచి 340,346 సర్వే నంబర్లలోని వందల ఎకరాలు అక్రమంగా పరుల పేరిట పట్టాలు మారగా విక్రయానికి పెట్టారు. ఆయా భూములన్నీ తమవంటే, తమవేనంటూ రెండు మూడు పార్టీలు వాటిలో పాగా వేశాయి. నిత్యం గ్యాంగులతో స్థలాల్లో కాపుకాస్తూ అటుగా వచ్చే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
ప్రాణాలు కోల్పోయిన ఘటనలు..
భూ వివాదాల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా జిల్లాలో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గోదావరి సమీపంలో ఉన్న ఓ స్థలం కోసం రెండు వర్గాల మధ్య వివాదాలు ఉండగా బొద్దున రామస్వామి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొన్నేళ్ల కింద ప్రత్యర్థులు తుపాకితో కాల్చి చంపారు. అప్పట్లో ఈ విషయం సంచలనం స్పష్టించింది. రెండు రోజుల క్రితం భూ వివాదం కారణంగా నడిపెల్లి లక్ష్మీకాంతరావుపై ప్రత్యర్థులు దాడిచేసి నరికి చంపారు. అలాగే లక్షెట్టిపేట మండలానికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తిని తుపాకితో సహా పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదం కారణంగా ఓ లాడ్జిలో మకాం వేసిన అతను కొందరిని తుపాకితో బెదిరించాడు. జిల్లా కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్ సమీపంలో ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చి ఇతరుకు విక్రయించిన ఓ రియల్‌ఎస్టేట్ వ్యాపారిపై రెండేళ్ల క్రితం మంచిర్యాల పోలీసులు పీడీ యాక్టు అమలు చేసి జైలుకు తరలించారు. ఈ విషయంలో రరెంండు పార్టీ మధ్య వివాదం బయటకి రావడంతో పోలీస్‌స్టేషన్‌దాకా వెళ్లింది. ఇలా భూ వివిదాల కారణంగా బెదిరింపులకు పాల్పడుతున్న కేసులు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లనో తరుచుగా నమోదవుతున్నాయి. భూములు ధరలు ఎక్కువగా ఉన్న పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల్లో 80 శాతం భూ వివాదాలకు సంబంధించినవి కావడమే పరిస్థితికి అద్దం పడుతోంది. భూ వివాదాలకు కొందరు రెవెన్యూ అధికారులు కూడా కారణం అవుతున్నారు. వారి అండదండలతోనే లావుని పట్టా భూములకు సైతం పట్టాలు పుట్టుకురావడం, ఒకరి పేరిట ఉన్న పట్టా మరొకరి పేరుతో ఉంటుండడం జిల్లాలో పరిపాటిగా మారింది.