MP Soyam Bapurao: ఎంపీ లాడ్స్‌ నిధులను వాడుకున్నా!

ABN , First Publish Date - 2023-06-20T03:02:40+05:30 IST

ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు మరో వివాదంలో చిక్కుకున్నారు.

MP Soyam Bapurao: ఎంపీ లాడ్స్‌ నిధులను  వాడుకున్నా!

ఇల్లు కట్టుకున్నాను.. కొడుకు పెళ్లి చేశాను

ఇలా ఎవరూ చెప్పరు.. నేను ఒప్పుకొంటున్నా

ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు

వీడియో వైరల్‌ కావడంతో ఖండించిన ఎంపీ

మార్ఫింగ్‌ వీడియోతో నాపై కుట్ర చేస్తున్నారు

మా పార్టీ నేతలు రమేశ్‌ రాథోడ్‌, పాయల శంకర్‌ బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారు: బాపురావు

ఆదిలాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు మరో వివాదంలో చిక్కుకున్నారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంపీ లాడ్స్‌ నిధులను తన సొంత అవసరాలకు వాడుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ నిధులతో తాను ఇల్లు కట్టుకున్నానని, కుమారుడి పెళ్లి చేశానని చెప్పారు. నాలుగు రోజుల క్రితం ఆదిలాబాద్‌లోని తన నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారి.. రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ఆ సమావేశంలో బాపురావు మాట్లాడుతూ, ‘‘ఎంపీ లాడ్స్‌ నిధులు రెండో విడత రెండున్నర కోట్లు వచ్చాయి. వాటిని కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు పనులు కోసం ఇవ్వాల్సి ఉంది. కానీ, కొన్ని వాడుకున్నాను. ఈ విషయాన్నీ ఏ నాయకుడూ ఒప్పుకోడు. కానీ, నేను ధైర్యంగా ఒప్పుకొంటున్నాను. నేనైతే మాములుగానే వాడుకున్నాను కానీ, అంతకుముందు ఉన్న దద్దమ్మ ఎంపీలు పూర్తిగా వాడుకున్నారు’’ అని అన్నారు. పనిలో పనిగా.. తమ పార్టీలోకి వచ్చిన దొంగ నాయకులు అనేక రకాలుగా విమర్శిస్తున్నారని, అంతకుముందు వాళ్లు వాడుకున్నారు కాబట్టే తనను విమర్శిస్తున్నారని బాపురావు ఆరోపించారు. దేశంలో ఏ ఎంపీకి రూ.5 కోట్ల నిధులు రాలేదని, బండి సంజయ్‌, అరవింద్‌కు కూడా ఇన్ని నిధులు రాలేదని అన్నారు. తాను కష్టపడి తెచ్చి కార్యకర్తలకు ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. బాపురావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆయన స్పందించారు. తాను ఎలాంటి నిధులనూ సొంత ఖర్చులకు వాడుకోలేదన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీఆర్‌ఎస్‌ నేతలు తనపై కుట్రలు చేస్తున్నారని, తన మాటలను మార్ఫింగ్‌ చేసి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ లాడ్స్‌ నిధులను దుర్వినియోగం చేసినట్లు నిరూపిస్తే.. రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. అయితే ఆ తరువాత.. సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని బాపురావు ఆరోపించారు. సోమవారం రాత్రి ఆదిలాబాద్‌ లోని తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలైన మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌ గత కొంతకాలంగా తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొన్నిసార్లు తన పేరును వాడుకుని పరువు తీయడంతో కఠినంగా వ్యవహరించానన్నారు. దీనిని మనసులో పెట్టుకుని తనను బద్నాం చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వారిద్దరినీ లైట్‌గానే తీసుకుంటానని, వారిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేయబోనని చెప్పారు. అంతా అధిష్ఠానమే చూసుకుంటుందన్నారు.

Updated Date - 2023-06-20T05:38:14+05:30 IST