ఆదిలాబాద్‌ సిగలో మరో నగ!

ABN , First Publish Date - 2023-05-06T00:29:52+05:30 IST

వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

ఆదిలాబాద్‌ సిగలో మరో నగ!
సాత్నాల వద్ద స్థల పరిశీలన చేస్తున్న యూనివర్సిటీ అధికారుల బృందం

జైనథ్‌ మండలంలోని సాత్నాల వద్ద 90 ఎకరాల స్థలం కేటాయింపు

ఈయేడు జూన్‌ నుంచే కళాశాల తరగతుల ప్రారంభం

తాజాగా జిల్లాలో పర్యటించిన యూనివర్సిటీ అధికారులు

పంటల సాగుపై పరిశోధనలకు మరింత అవకాశం

హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

ఆదిలాబాద్‌, మే 5(ఆంధ్రజ్యోతి): వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన జిల్లాలో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈయేడు నుంచే తరగతులను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. మొదట బట్టిసావర్గాం, అనుకుంట గ్రామాల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు అధికారులు స్థల పరిశీలన చేశారు. కానీ, ఇది అనువైన ప్రాంతం కాకపోవడం, కొన్ని న్యాయపరమైన చిక్కు లు ఎదురుకావడంతో జైనథ్‌ మండలం సాత్నాల వద్ద నీటి పారుదల శాఖ ఆధీనంలో ఉన్న 90ఎకరాల స్థలాన్ని గుర్తించి కేటాయించారు. ఇక్కడ కళాశాల ఏర్పాటుకు అన్నిరకాల అనుకూలం కావడంతో ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ అధికారులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటికే సర్వేను పూర్తి చేసిన రెవెన్యూ అధికారులు హద్దులను ఏర్పాటు చేసి యూనివర్సిటీ అధికారులకు స్థలాన్ని అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. శుక్రవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ రిజిస్ర్టార్‌ డా.సుధీర్‌కుమార్‌, యూనివర్సిటీ డీన్‌ డా.సీమా, ఎస్టేట్‌ అధికారి మోహన్‌రెడ్డి, ఇంజనీర్‌ అధికారులు మురళీ, వెంకటకృష్ణ, ఇతర అధికారుల బృందం జిల్లాలో పర్యటించి స్థల పరిశీలన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ను కలిసి చర్చించారు. అయితే ఇప్పటికే జిల్లాలో వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానం ఉంది. కొత్తగా వ్యవసాయ కళాశాల కూడా మంజూరుకావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మారనున్న ముఖచిత్రం

వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో జిల్లా ముఖచిత్రం మారనుంది. ఈ యేడు నుంచే తరగతులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు 90ఎకరాల స్థల సేకరణ చేసినా.. భవన నిర్మాణాలకు రెండు, మూడేళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో తాత్కాలిక భవనాల్లో తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నా రు. జిల్లాకేంద్రంలో అన్నిరకాల అనుకూలమైన కృషి విజ్ఞాన కేంద్రంలోనే ఈ యేడు తరగతులను ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. 2023-24 అకాడమిక్‌ ఇయర్‌లో 60సీట్లను కేటాయించనున్నారు. 66రెగ్యూలర్‌ పోస్టులతో పాటు 47 ఔట్‌సోర్సింగ్‌ పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం కృషి విజ్ఞాన కేంద్రంలో ఆరుగురు అధ్యాపకులు, వ్యవసాయ పరిశోధన స్థానంలో ఐదుగురు శాస్త్రవేత్తలు విధులు నిర్వర్తిస్తున్నారు. మరో 20మంది వరకు అధ్యాపకులు జిల్లాకు రానున్నారు. విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలనకు కూడా కృషి విజ్ఞాన కేంద్రం అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. కళాశా ల ఏర్పాటుతో రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల విద్యార్థులు జిల్లాలో చదువుకునే అవకాశం ఉంటుంది. దీంతో అనుబంధ రంగాల అభివృద్ధికి ఆస్కారం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పంటల సాగుకు సహకారం

వ్యవసాయ కళాశాల ఏర్పాటుతో జిల్లా రైతాంగానికి ఎంతో మేలు జరుగనుం ది. జిల్లాలో పండించే ప్రధాన పంటలైనా పత్తి, సోయా, కంది, శనగపై మరిన్ని పరిశోధనలకు అవకాశం ఉంటుంది. వ్యవసాయ కళాశాల విద్యార్థుల క్షేత్ర స్థాయి పరిశీలనతో పంటల సాగు పద్ధతులు, యాజమాన్య పద్ధతులు, చీడపీడ ల నియంత్రణపై రైతుల్లో అవగాహన కల్పించనున్నారు. అలాగే పంటల సాగులో ఎదురయ్యే సమస్యలపై రైతులు నేరుగా శాస్త్రవేత్తలు, అధ్యాపకులను కలిసే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమస్యలపై మరింత లోతైనా పరిశోధనలు చేయడం, మేలు రకం విత్తన ఉత్పత్తితో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. జిల్లాలో ఏర్పాటు చేసే కళాశాల యూనివర్సిటీ అనుబంధం కావడంతో నాణ్యమైన వ్యవసాయ విద్యను అందించేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు మరింత బలోపేతం కానున్నాయి. కళాశాలలో చేపట్టే పంటల సాగుతో వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయి. పంటల సాగులో ఆధునిక పద్ధతులు, మెళకువలు నేర్చుకునే విద్యార్థులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులకు వివరించే వీలుంటుంది. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జిల్లాలో సాగు చేసే పంటలపై మరిన్ని పరిశోధనలు జరుగనున్నాయి.

మరిన్ని పరిశోధనలకు అవకాశం : శ్రీధర్‌చౌహాన్‌, సీనియర్‌ శాస్త్రవేత్త,

వ్యవసాయ పరిశోధన స్థానం, ఆదిలాబాద్‌

జిల్లాలో ఏర్పాటు చేసే వ్యవసాయ కళాశాలతో పంటల సాగుపై మరిన్ని పరిశోధనలకు వీలుంటుంది. వ్యవసాయమే జీవనాధారమైన జిల్లా రైతాంగానికి క్షేత్రస్థాయిలోనే సలహాలు, సూచనలు అందించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పరిశోధన స్థానంలో పలు రకాల పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుంది. దీంతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

పంటల సాగుపై పరిశోధనలు జరిగితే అధిక దిగుబడులు సాధించే అవకాశం కూడా ఉంటుంది.

Updated Date - 2023-05-06T00:29:52+05:30 IST