జిల్లాలో ఈదురుగాలుల వర్షం

ABN , First Publish Date - 2023-04-25T23:05:27+05:30 IST

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పలు చోట్ల మంగళవారం సాయంత్రం ఈదురు గాలుల వర్షం కురిసింది.

జిల్లాలో ఈదురుగాలుల వర్షం
జైనూర్‌లో ఈదురు గాలులకు ఎగిరిపోయిన రేకులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 25: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పలు చోట్ల మంగళవారం సాయంత్రం ఈదురు గాలుల వర్షం కురిసంది. కేంద్రంలో మంగళవారం ఆకాశం ఒక్కసారి మేఘావృతమైన ఈదురు గాలుతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలులతో చెట్ల కొమ్మలు విరిగి పడి విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మండలంలోని గుండిలో పిడుగుపడి రాస్పల్లి ఆనంద్‌ రావు అనే రైతుకు చెందిన జొన్న చొప్ప కాలిపోయింది. గుండి తాత్కాలిక వంతెన తెగిపోయింది.

కాగజ్‌నగర్‌: పట్టణంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పట్టణంలోని పలు చోట్ల బోర్డులు పడిపోయాయి. అలాగే పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. ఈదురుగాలుల తీవ్రతకు కరెంటు సరఫరా నిలిపివేశారు. వివిధ చోట్ల చెట్ల కొమ్మలు పడి పోయిన వాటిని తొలగించి రాత్రి ట్రాన్స్‌ అధికారులు కరెంటు సరఫరాను పునరుద్ధరించారు.

సిర్పూర్‌(యు): మండలంలో మంగళవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంగడి గ్రామా పంచాయితీ పరిధిలో గల పెద్దదోబ్బలో ఈదురు గాలులు బీభత్సంతో ఇళ్ల రెకులు ఎగిరిపోయాయి. సుమారు 20 ఇళ్లకు సంబందించిన రేకు పైకప్పులు నేలమట్టమయ్యాయి. గాలి తీవ్రతకు దెబ్బతిన్న ఇళ్లను సర్పంచ్‌ ఆత్రం జాలింషా పరిశీలించారు. పలు చోట్ల విద్యుత్‌ స్తంభాలు ఈదురు గాలులకు పడిపోయాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

జైనూర్‌: మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని జెండాగూడ గ్రామానికి చేందిన ఇబ్రహిం ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. సుమారు గంటపాటు ఈదురు గాలులు బలంగా వీయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది.

Updated Date - 2023-04-25T23:05:27+05:30 IST