నిరీక్షణ గదులు నిరుపయోగం!
ABN , First Publish Date - 2023-05-04T01:30:20+05:30 IST
మారుమూల గ్రా మీణ ప్రాంతాలతో పాటు గిరిజన గ్రామాలకు చెంది న గర్భిణులను ప్రసవ సమయం లో అత్యవసర అంబులెన్స్‌లు ఆదు కుంటుండగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన జననీ నిరీక్షణ గదులు అలంకారప్రాయంగా మారాయి.
అలంకారప్రాయంగా మారిన వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జననీ నిరీక్షణ గదులు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొరవడిన వైద్యుల పర్యవేక్షణ
విధులు సక్రమంగా నిర్వర్తించని వైద్య సిబ్బంది
మారుమూల గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు తప్పని తిప్పలు
చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందంటున్న గ్రామీణులు
అత్యవసర సమయాల్లో ఆదుకుంటున్న 108 అంబులెన్స్‌లు
గత యేడాది కాలంలో అంబులెన్స్‌లోనే ప్రసవించిన 66 మంది గర్భిణులు
ఉట్నూర్, మే 3: మారుమూల గ్రా మీణ ప్రాంతాలతో పాటు గిరిజన గ్రామాలకు చెంది న గర్భిణులను ప్రసవ సమయం లో అత్యవసర అంబులెన్స్‌లు ఆదు కుంటుండగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన జననీ నిరీక్షణ గదులు అలంకారప్రాయంగా మారాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అంతంతమాత్రంగానే అమలవుతున్నాయి. ఈ కార్యక్రమాలను అమలు చేయాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల పర్యవేక్షణ కొరవడడంతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ఏఎన్‌ఎం లు, ఆశ వర్కర్లు సైతం సక్రమంగా విధులు నిర్వహించడం లేదని ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
రూ.లక్షల వ్యయంతో గదులు
ఉట్నూర్ ఆస్పత్రి ఆవరణలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జననీ నిరీక్షణ గదులు (బర్త్ వెయిటింగ్ రూమ్స్) అలం కారప్రాయంగా మారాయి. ఇదే కాకుండా ఉమ్మడి జిల్లాలోని జైనూర్, ఆసిఫాబాద్, మంచిర్యాలలలో కూడ జననీ నిరీక్షణ గదులు ఏర్పాటు చేసిన లాభం అంతంతమాత్రమే కనిపిస్తుంది. గర్భిణులకు ప్రతీనెల గ్రామీణ ప్రాంతాలలోని ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్ల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తూ.. వారికి మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కార్డును ఏర్పాటు చేసి వారి ఆరోగ్య వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. మధుమేహంతో ఉన్న వారిని గుర్తించడంతో పాటు కడుపులో పిండం అడ్డం తిరిగే వారిని గుర్తించడం, ఎత్తు తక్కువగా ఉన్న వారి ని గుర్తించడం, రక్తహీనతతో ఉన్నవారిని గుర్తించడం, మొదటి కాన్పులో సీజీరీయన్ అయిన వారు ఉంటే రెండవ కాన్పులో కూడా సిజేరియన్‌తో సిఫార్సు చే యడం లాంటివి మాతా శిశు సంరక్షణ కార్డులో పొందుపర్చాల్సి ఉంటుంది. మూడు, నాలుగు నెలల గర్భిణులకు ఆశాలు, ఏఎన్‌ఎంలు స్కానింగ్ కోసం సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుక వెళ్లి గర్భిణులకు పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఒకటి, రెండుసార్లు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు గర్భిణులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అదేమాదిరి మూడు, నాలుగు సార్లు స్త్రీ వైద్య నిపుణులతో పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇవ్వన్నీ అంతంతమాత్రమే జరుగుతున్నట్లు గ్రామీణ ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నా రు. ప్రభుత్వ ఆశయం బాగున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో వైద్యాధికారులు పట్టించుకోకపోవడం వల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని గ్రామీణులు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రసవానికి సిద్ధంగా గర్భిణులను ఆశ వర్కర్ల ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాలలో అందుబాటులో జననీ సురక్షణ గదులకు తీసుకువెళ్లి సుఖప్రసవం జరిగేలా చూడాల్సిన వైద్య సిబ్బంది పట్టించుకోక పోవడం వల్లనే గ్రామీణ మహిళలకు ఇబ్బందులు ఏ ర్పడుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
ఆదుకుంటున్న అంబులెన్స్‌లు
ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో తక్షణ వైద్య సహాయం కోసం ఏర్పాటు చేసిన 108 అంబు లెన్స్‌లు ప్రసవ సమయంలో గర్భిణులను ఆదుకుంటున్నాయి. అత్యవసర సమయంలో గర్భిణులను ఆస్పత్రులకు తరలిస్తున్న క్రమంలో పురిటినొప్పులు అధికం అవు తుండడంతో ఇప్పటి వరకు గత యేడాది కాలం నుంచి 66 మంది గర్భిణులు అంబులెన్స్‌లలోనే ప్రసవించారంటే మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు ఎంతమేర జరుగుతున్నాయో అర్థం అవుతుంది. ఉట్నూర్ మండలంలోని చాం దూరి, గొట్టి, సాలేవాడ (కే), మోతిరాంగూడతో పాటు తదితర గ్రా మాల నుంచి గర్భిణులను ఆస్పత్రులకు తరలిస్తుండగా మార్గమద్యంలో ఉన్న 12 మంది గర్భిణులు అంబులెన్స్‌లో ప్రసవించారు. అలాగే, గాదిగూడ మండలంలోని ఆద్మీయాన్, కొలా, ఖండోరాంపూర్, బుడ్డిగూడ, కొత్త పల్లి, కునికాస, పర్సావాడ, పావునూర్, డోంగ్రగాం, తదితర గ్రామాకు చెందిన 20 మంది గర్భిణులను ప్రసవం కోసం తరలిస్తుండగా మార్గమద్యలోనే అంబులెన్స్‌లలో ప్రసవించారు. అదేవిధంగా ఇంద్రవెల్లి 108 అంబులెన్స్‌లో 26 మంది, నార్నూర్ అంబులెన్స్‌లో 8మంది గర్భిణులు ఆస్పత్రులకు తరలిస్తుంగా మార్గమద్యలోనే 108 అంబులెన్స్‌ల ఉన్న ఈఎంటీల ఆధ్వర్యంలో ప్రసవించారు.
గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది
: కుమ్రం బాలు, ఏడీఎంహెచ్‌వో, ఉట్నూర్
ఏజెన్సీలోని గ్రామీణ ప్రాంతాల గర్భిణులలో చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది గర్భిణులకు ప్రతీనెల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉటుంది. దీంతో పాటు జననీ నిరీక్షణ గదులకు ప్రసవం తేదీ దగ్గర పడినప్పుడు ఆశల ఆధ్వర్యంలో గర్భిణులను తీసుకువెళ్లాలి. కాగా, ఉమ్మడి జిల్లాలోని తిర్యాణి ఆస్పత్రిలో కూడా జననీ నిరీక్షణ గదుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపడం జరిగింది.