పాఠశాలల స్థలాలకు రక్షణ ఏది?
ABN , First Publish Date - 2023-06-04T22:33:07+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. స్థలాలకు సంబంధించిన దస్తావేజులు రెవె న్యూ రికార్డుల్లో, విద్యాశాఖ వద్ద లేకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్థలాల్లో అధిక భాగం విరాళాల రూపంలో సమ కూర్చుకోగా కొన్ని చోట్ల ప్రభుత్వపరంగా కొనుగోలు చేసినవి ఉన్నాయి. దశాబ్దాల క్రితం సేకరించిన స్థలాల్లో పాఠశాలల భవనాలు నిర్మించారు.
మంచిర్యాల, జూన్ 4(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల స్థలాలకు రక్షణ లేకుండా పోయింది. స్థలాలకు సంబంధించిన దస్తావేజులు రెవె న్యూ రికార్డుల్లో, విద్యాశాఖ వద్ద లేకపోవడమే దీనికి కారణం. ప్రభుత్వ పాఠశాలలకు చెందిన స్థలాల్లో అధిక భాగం విరాళాల రూపంలో సమ కూర్చుకోగా కొన్ని చోట్ల ప్రభుత్వపరంగా కొనుగోలు చేసినవి ఉన్నాయి. దశాబ్దాల క్రితం సేకరించిన స్థలాల్లో పాఠశాలల భవనాలు నిర్మించారు. ప్రస్తుతం చాలా చోట్లా అవే భవనాల్లో పాఠశాలలు కొనసాగుతున్నాయి. పలు పాఠశాలలకు ఇప్పటికీ ప్రహరీలు నిర్మించలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల భవనాలకు నేటికీ ప్రహరీలు లేవు. ప్రహరీలు లేకపోవడంతో కాలక్రమంలో పాఠశాలల స్థలాలు కబ్జాలకు గురవుతూ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల పాఠశాలల స్థలాలు కబ్జాలకు గురయ్యాయని స్వయంగా విద్యాశాఖ అధికారులే చెబుతుండడం గమనార్హం.
ఫ అందుబాటులో లేని దస్తావేజులు
ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 99 శాతం స్థలాలకు ఎలాంటి దస్తావేజులు అందుబాటులో లేవు. రెవెన్యూ రికార్డుల్లో కూడా పట్టేదారు పేర్లే కనిపిస్తున్నాయి. దండేపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాల స్థలం కబ్జాకు గురి కావడంతో ’ఆంధ్రజ్యోతి’ సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాలల స్థలాల వివరాలు సేకరించింది. రెవెన్యూ, విద్యాశాఖ అధికా రులు ఇచ్చిన సమాచారంలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. దండేపల్లి మండలంలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 53 ఉన్నాయి. అం దులో ప్రాథమిక పాఠశాలలు 37, ప్రాథమికోన్నత పాఠశాలలు 7, ఉన్నత పాఠశాలలు 9 ఉన్నాయి. వీటిలో కేవలం 11 స్కూళ్లకు సంబంధించిన వివరాలు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో అసంపూర్తిగా ఉన్నాయి. 2010-11 అడంగల్ పహాణీ ప్రకారం అనుభవదారు కాలమ్‌లో కొన్ని పాఠశాలల పేర్లు ఉండగా, ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో తిరిగి పట్టేదార్ల పేర్లు దర్శనమిస్తుండడం గమనార్హం.
- దండేపల్లి మండలం చింతపల్లి ప్రాథమిక పాఠశాల ప్రస్తుతం విద్యార్థులు లేక మూతపడగా అంగన్‌వాడీ కేంద్రానికి వినియోగిస్తున్నారు. స్థలానికి సంబంధించి ఎలాంటి దస్తావేజులు అందుబాటులో లేవు. ధరణి పోర్టల్‌లో మాత్రం పట్టాదారు పేరు గోపతి మల్లయ్యగా నమోదైంది.
- నర్సాపూర్ ప్రాథమిక పాఠశాల స్థలం 7.8 గుంటలు ఉండాల్సి ఉంది. విద్యాశాఖ వద్ద ఉన్న పత్రాల్లో కేవలం 2 గుంటలు రికార్డుల్లో ఉంది. పైగా ధరణి పోర్టల్‌లో పట్టేదారు కాలమ్‌లో గాండ్ల సత్యనారాయణగా నమోదైంది.
- మామాడిపల్లి జడ్పీహెచ్‌ఎస్‌కు సంబంధించి 2.36 ఎకరాల స్థలం గతంలో సేకరించారు. ప్రస్తుతం ఎకరం స్థలమే ఉండగా దాని చుట్టూ ప్రహరీ నిర్మించారు. మిగతాది ఇతరుల కబ్జాలో ఉంది. ధరణి పోర్టల్‌లో అనుభవదారు పేరు పాఠశాల స్థలం కాకుండా వెంకట శ్రీనివాసరావు పేరిట పట్టా ఉంది. స్థానికులు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు.
- ముత్యంపేట ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేదు. గతంలో 38 గుంటల స్థలం ఉండేదని గ్రామస్థులు తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం మాత్రం 18 గుంటల స్థలం ఉన్నట్లు తెలిపారు. ధరణి పోర్టల్‌లో పట్టేదారు కాలమ్‌లో కుదిరే రాజమల్లుగా నమోదు కావడం గమనార్హం. ఇదే మాదిరిగా దస్తావేజులు లేని కారణంగా మండలంలోని 50 పాఠ శాలల స్థలాలు కబ్జాలకు గురయ్యాయి. కేవలం మూడు పాఠశాలలకు సంబంధించిన వివరాలు మాత్రమే విద్యాశాఖ వద్ద లభించడం గమ నార్హం. ఎలాంటి దస్తావేజులు అందుబాటులో లేకపోయినా కొందరు హెచ్‌ఎంలు ఆర్టీఐ యాక్టు కింద ఇచ్చిన సమాచారంలో ప్రభుత్వ భూమిగా పేర్కొనడం కొసమెరుపు.
ఫ పట్టించుకోని అధికారులు
జిల్ల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 847 ఉన్నాయి. వాటిలో అధిక శాతం పాఠశాలల స్థలాలకు సంబంధించి ఎలాంటి రికార్డులు అందుబాటులో లేవు. ఉన్న స్థలాలను కాపాడుకోవడానికి అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మనబడి పేరిట పాఠశాల భవనాలకు మరమ్మతులు, ఇతర ఏర్పాట్లు చేస్తున్న అధికారులు అత్యంత విలువైన స్థలాలను మాత్రం పట్టించుకోవడం లేదు. పాఠశాలల భవనాల కోసం స్థలాలు సేకరించిన అధికారులు వాటిని రికార్డుల్లోకి ఎక్కించడంలో నిర్లక్ష్యం వహించారు. పాఠశాలల పేరిట రెవెన్యూ రికార్డుల్లోకి మార్పిడి చేయకపోవడంతో ఇప్పటికీ పట్టేదారుల పేర్లు దర్శన మిస్తున్నాయి. అసలు ఏ పాఠశాలకు ఎంత స్థలం ఉందో తెలియని పరిస్థితి ఉంది. పాఠశాలల స్థలాలు ధరణి పోర్టల్‌లో నమోదు కావడంతో రైతుబంధు సైతం పొందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల స్థలాలను అధికారులు కబ్జాలకు గురికాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.