ఆదర్శంగా నిలుస్తున్న మహిళా సర్పంచ్‌లు, కార్యదర్శులు
ABN , First Publish Date - 2023-02-09T22:29:35+05:30 IST
కౌటాల, ఫిబ్రవరి 9: వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు మండలంలోని పలు గ్రామ పంచాయతీల మహిళా సర్పంచ్‌లు. ఇప్పటికే మూడు సార్లు ‘పంటసిరి’ పేరిట ప్రత్యేక మేళాలు నిర్వహించి సేంద్రీయ ఎరువులు విక్రయించి గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్చారు.
- ప్రభుత్వ సెగ్రిగేషన్ షెడ్లలో వర్మీ కంపోస్ట్ తయారీ
- కలిసికట్టుగా ముందుకు
కౌటాల, ఫిబ్రవరి 9: వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు మండలంలోని పలు గ్రామ పంచాయతీల మహిళా సర్పంచ్‌లు. ఇప్పటికే మూడు సార్లు ‘పంటసిరి’ పేరిట ప్రత్యేక మేళాలు నిర్వహించి సేంద్రీయ ఎరువులు విక్రయించి గ్రామ పంచాయతీకి నిధులు సమకూర్చారు.
కౌటాల మండలంలో 20గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ పది మంది మహిళా సర్పంచ్‌లు ఉండగా 13గ్రామ పంచాయతీలకు మహిళా పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. మహిళా సర్పంచ్‌ల్లో మెజారిటీ ఆదివాసీ గిరి జన మహిళలు ఉండడం విశేషం. వర్మీకంపోస్ట్ తయారీ కోసం వీరంతా జిల్లా అధికారులు చేసిన సూచనలతో తమ వంతుగా ముందడుగు వేశారు. దీంతో నెలల కాలంలో ఫలితం వచ్చింది. చెత్తను వేరుచేయడంతోపాటు వానపాములను పెంచ డం, కంపోస్ట్ ఎరువు తయారీలో మహిళా సర్పంచ్‌లు, సెక్రటరీలు కలిసికట్టుగా పని చేశారు. ముందెన్నడూ పెద్దగా అవగాహన లేని పని అయినా తమ వంతు చొరవ చూపారు. ప్రతిరోజు సెగ్రిగేషన్ షెడ్‌లను పరిశీలించారు. వర్మీకంపోస్టు తయారీలో జిల్లా, మండలపరిషత్ అధ్యక్షులు, అధికారుల సహకారంతో చెత్తను తొలగించేందుకు ఖర్చుచేసే పరిస్థితి నుంచి పంచాయతీలకు ఆదాయాన్ని సమకూర్చే స్థాయికి ఎదిగారు. వర్మీకంపోస్టును మొదట విక్రయించినపుడు రూ.16వేలు, రెండో విడతలో రూ.43,500, మూడో విడతలో రూ.33వేలు మొత్తం 93,500 ఆదాయం సమకూరింది. దీనిని తర్వాత గ్రామపంచాయతీల వారీగా పంచుకోను న్నారు.
‘పంట సిరి’ పేరుతో మేళా..
మండలంలోని గ్రామ పంచాయతీల్లో సెగ్రిగేషన్ షెడ్ల ద్వారా తయారుచేసిన వర్మీకంపోస్టును విక్రయిం చేందుకు మండల కేంద్రంలో ప్రత్యేకంగా ‘పంట సిరి’ పేరుతో వర్మీకం పోస్టు విక్రయ మేళా నిర్వహించారు. రైతులకు కిలో చొప్పున అమ్మారు. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ రైన జిల్లా అదనపుకలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ మహిళల పనితీరును కొనియాడారు.
రైతులు ముందుకు వస్తున్నారు..
- శాలిని, పంచాయతీ కార్యదర్శి
సేంద్రియ ఎరువులు కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో రైతులు ముందుకువస్తున్నారు. సెగ్రిగేషన్ షెడ్ల లో తయారీ విధానం, పద్ధతులను తెలుసుకుని రైతులు కూడా తమ ఇళ్ల లోని చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సర్పంచ్, గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో సేంద్రియ ఎరువుల తయారీని విజయ వంతం చేస్తున్నాం. జిల్లా, మండలస్థాయి అధికారుల సహకారం కూడా మరువ లేనిది.
మా పొలానికి సేంద్రియ ఎరువునే వాడుతున్నాం..
- రేణుక, సర్పంచ్, వీర్దండి
స్థానిక సెగ్రిగేషన్ షెడ్ల ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువులను మా పంటపొలాల్లో వాడుతున్నాం. స్థానికంగానే సేంద్రీయ ఎరువులు తయారు చేసి రైతులకు తక్కువ ధరకు విక్రయించడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే గ్రామ పంచాయతీకి ఆదాయం కూడా వస్తోంది.