Aishwarya: నాగోల్ స్మశాన వాటికలో ఐశ్వర్య అంత్యక్రియలు
ABN , First Publish Date - 2023-05-11T17:29:08+05:30 IST
నాగోల్ (Nagole) స్మశాన వాటికలో ఐశ్వర్య (Aishwarya) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మే 6న అమెరికా (America) టెక్సాస్‌లో కాల్పుల్లో ఐశ్వర్య చనిపోయింది.
హైదరాబాద్: నాగోల్ (Nagole) స్మశాన వాటికలో ఐశ్వర్య (Aishwarya) అంత్యక్రియలు పూర్తయ్యాయి. మే 6న అమెరికా (America) టెక్సాస్‌లో కాల్పుల్లో ఐశ్వర్య చనిపోయింది. 6న ఐశ్వర్య తన స్నేహితుడితో టెక్సాస్ (Texas)లోని ఓ మాల్‌కు షాపింగ్‌కు వెళ్లిందామె. అగంతుకుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయింది. ఐశ్వర్య స్వగ్రామం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మునిసిపాలిటీ పరిధిలోని పాతనేరేడుచర్ల. రంగారెడ్డి జిల్లా కమర్షియల్ కోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తాటికొండ నర్సిరెడ్డి, అరుణ దంపతుల కుమార్తె ఆమె. ఆ దంపతులకు శ్రీకాంత్‌రెడ్డి అనే కుమారుడు కూడా ఉన్నాడు. నర్సిరెడ్డి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని హుడాకాలనీలో నివాసం ఉంటోంది. హైదరాబాద్‌లోని మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య.. ఉన్నత చదువుల కోసం 2018లో అమెరికా వెళ్లింది. ఈస్టర్న్ మిషిగన్ యూనివర్సిటీలోని గ్రాండ్ స్కూల్లో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో ఎమ్మెస్ పూర్తి చేసి, టెక్సస్ సమీపంలోని పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. కిందటి సంవత్సరం డిసెంబరులో తన అన్న శ్రీకాంత్‌రెడ్డి పెళ్లికి చివరిసారిగా భారత్‌కు వచ్చిందామె. శనివారం మధ్యాహ్నం మాల్‌కు వెళ్లే ముందు ఐశ్వర్య తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వాత 5 నిమిషాలకే ఆమె తుపాకీ తూటాలకు బలైంది.
ఇంత దారుణానికి పాల్పడిన ఆ వ్యక్తిని.. మౌరిసియో గార్సియా (33) అనే అతివాదిగా (ఫార్ రైట్ వింగ్), నియోనాజీ సానుభూతిపరుడుగా పోలీసులు గుర్తించారు. అతడి దుస్తులపై ‘ఆర్డబ్ల్యూడీఎస్’ అనే స్టికర్ ఉందని వెల్లడించారు. ఆర్డబ్ల్యూడీఎస్ అంటే.. రైట్ వింగ్ డెత్ స్క్వాడ్ అని అర్థం. తన ఫేస్బుక్ ఖాతాలో అతడు శ్వేతజాతి దురహంకార పోస్టులు పెట్టేవాడని సమాచారం. అమెరికా సైన్యంలో పనిచేసిన గార్సియాను మానసిక ఆరోగ్యం బాగోలేదని విధుల నుంచి తొలగించారు. తర్వాత నుంచీ అతడు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు.