Share News

BJP Janasena: బీజేపీలో చిచ్చు పెట్టిన పొత్తు?

ABN , First Publish Date - 2023-10-29T15:30:04+05:30 IST

జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారని సమాచారం.

BJP Janasena: బీజేపీలో చిచ్చు పెట్టిన పొత్తు?

హైదరాబాద్: జనసేన పొత్తు అంశం బీజేపీలో కలకలం రేపుతోందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. పొత్తులో భాగంగా తమ స్థానాలు జనసేనకు ఇచ్చే ప్రసక్తేలేదని బీజేపీ అభ్యర్థులు చెబుతున్నారని సమాచారం. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి సీట్లు జనసేనకు కేటాయిస్తారంటూ బీజేపీలో జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

జనసేనకు సీట్లు కేటాయిస్తారేమోననే ప్రచారం నేపథ్యంలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి బీజేపీ నేతలు వేర్వేరుగా సమావేశమైనట్టు తెలుస్తోంది. శేరిలింగంపల్లి టిక్కెట్‌ను జనసేన ఇవ్వడాన్ని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. శేరిలింగంపల్లి టికెట్‌ను రవికుమార్ యాదవ్‌కు ఇవ్వాల్సిందేనని కొండా విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో కీలకమైన శేరిలింగంపల్లి సీటు రవికుమార్ యాదవ్ కోసం కొండా పట్టుపడుతున్నారు.


మరోవైపు కూకట్‌పల్లి సీటును జనసేనకు ఇచ్చే ప్రతిపాదనను మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. మెదట నుంచి పనిచేస్తున్న వారికి అన్యాయం చేయొద్దని ఆయన వాపోతున్నారు. జనసేనతో పొత్తు, సీట్ల కేటాయింపు బీజేపీ నాయకత్వానికి తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. అసంతృప్తులు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ ఎలా వ్యవహరిస్తుందో వేచిచూడాలి.

Updated Date - 2023-10-29T15:30:04+05:30 IST