TSRTC: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. రేపటినుంచి బస్సుల్లో ఫ్రీ జర్నీ
ABN , First Publish Date - 2023-12-08T17:23:47+05:30 IST
తొలిరోజే రేవంత్‌రెడ్డి సర్కార్ తన మార్కు పాలన చూపించారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నిమిషాల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో రెండు పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్: తొలిరోజే రేవంత్‌రెడ్డి సర్కార్ తన మార్కు పాలన చూపించారు. రెండో రోజు కూడా పలు కీలక అంశాలపై సమీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నిమిషాల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో రెండు పథకాలు అమలుకు శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రెండోది రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది. ఇందలో భాగంగానే శనివారం సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వయసుల మహిళలు, ట్రాన్స్‌జెండర్స్‌కి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా నారీమణులు ప్రయాణం చేయొచ్చని పేర్కొంది. ఇక త్వరలో ప్రత్యేకమైన సాప్ట్‌వేర్ ఆధారిత కార్డును ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తేనుంది. అలాగే మహిళలకు సంబంధించిన చార్జీలను రీయింబర్స్ రూపంలో ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనుంది.
తెలంగాణ పరిధి వరకు శనివారం మధ్యాహ్నం నుంచి ఉచిత బస్సు ప్రయాణ అమల్లోకి రానుంది. అంతరాష్ట్ర బస్సులకు కూడా తెలంగాణ పరిధి వరకు ఉచితం కల్పించింది. మొదటి వారం రోజుల పాటు ఎలాంటి ఐడెంటీ కార్డులు లేకుండానే ప్రయాణం చేయొచ్చని సూచించింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ ఆదేశాలు జారీ చేశారు.