Share News

Paleru Big Fight : పాలేరు.. పోరు జోరు!

ABN , First Publish Date - 2023-11-26T02:44:57+05:30 IST

పార్టీ క్యాడరే అండగా కోట్లకు పడగలెత్తిన ఇద్దరు నిర్మాణ సంస్థల అధిపతులను ఒంటరిగా ఢీకొంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇంకోవైపు! అందుకే, ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ

Paleru Big Fight : పాలేరు.. పోరు జోరు!

కాంగ్రెస్‌ కంచుకోటలో హస్తం, గులాబీ నువ్వా నేనా!?..

ఇద్దరు కోటీశ్వరుల మధ్య రసవత్తరంగా ఓట్ల వేట

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనీయనంటూ సవాల్‌

విసిరిన పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఒకవైపు!

అరంగేట్రంలోనే తుమ్మల నాగేశ్వరరావు వంటి దిగ్గజాన్ని ఓడించి..

రెండోసారి పొంగులేటితో తలపడుతున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కందాల ఉపేందర్‌ రెడ్డి మరోవైపు!

ఖమ్మం- ఆంధ్రజ్యోతి : పార్టీ క్యాడరే అండగా కోట్లకు పడగలెత్తిన ఇద్దరు నిర్మాణ సంస్థల అధిపతులను ఒంటరిగా ఢీకొంటున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇంకోవైపు! అందుకే, ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి బిగ్‌ ఫైట్‌ జరుగుతోంది! కేసీఆర్‌తో విభేదించి.. కాంగ్రె్‌సలో చేరి.. ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు క్రియాశీల పాత్ర పోషిస్తున్న పొంగులేటి పాలేరు బరిలో నిలవడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ప్రచారం జరుగుతోంది. నామినేషన్‌ దాఖలు రోజునే పొంగులేటి, ఆయన బంధువుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడంతో మరింత ఆసక్తి రేకెత్తించింది. పొంగులేటి, కందాల ఇద్దరూ రాజకీయాలతోపాటు నిర్మాణ సంస్థల అధిపతులు కావడంతో ఈసారి పాలేరులో కాసుల మోతేనన్న ప్రచారం జోరుగా ఉంది.

తొలి నుంచీ కాంగ్రెస్‌దే ఆధిపత్యం

పాలేరు నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇప్పటి వరకూ ఇక్కడ 14 సార్లు సాధారణ ఎన్నికలు, రెండుసార్లు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఒక ఉప ఎన్నిక సహా ఏకంగా 12 సార్లు కాంగ్రెస్‌ పార్టీయే విజయం సాధించిందంటే ఈ నియోజకవర్గం ఆ పార్టీకి ఎంతటి కంచుకోటనో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రైతులు, వ్యవసాయ కూలీలు, గిరిజనులు కాంగ్రె్‌సకు అనుకూల ఓటుబ్యాంకుగా ఉన్నారు. ఇక, మూడుసార్లు మాత్రం సీపీఎం విజయం సాధించింది. 2016లో జరిగిన ఉప ఎన్నికలో మాత్రం టీఆర్‌ఎస్‌ తరఫున తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. అంటే.. ఇక్కడ ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే అది కూడా ఉప ఎన్నికలో మాత్రమే టీఆర్‌ఎస్‌ గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన కందాల ఉపేందర్‌ రెడ్డి ఆ తర్వాత టీఆర్‌ఎ్‌సలో చేరి ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగారు. ఇప్పుడు ఇక్కడ గెలుపును పొంగులేటి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నిజానికి, వైసీపీ నుంచి టీఆర్‌ఎ్‌సలోకి చేరిన ఆయనకు గత ఎన్నికల్లో ఎంపీ టికెట్‌ నిరాకరించారు. అయినా, పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత కూడా ఎమ్మెల్సీ, రాజ్యసభ అవకాశం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కేసీఆర్‌పై ధిక్కార స్వరం వినిపించి.. కాంగ్రె్‌సలో చేరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా బీఆర్‌ఎస్‌ తరఫున గెలవనీయబోనని శపథం పట్టారు. కేసీఆర్‌ తీరుతోపాటు బీఆర్‌ఎస్‌ పాలనను ఎండగడుతున్నా రు. ఇక్కడ కాంగ్రె్‌సకు బలమైన ఓటుబ్యాంకు ఉంది. గిరిజనులు తొలినుంచీ అండగా నిలుస్తున్నారు.

palr.jpg

రెండోసారి గెలుపు ధీమాలో కందాల

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా.. నాటి బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించిన కందాల ఉపేందర్‌ రెడ్డి ఆ తర్వాత పరిణామాల్లో టీఆర్‌ఎ్‌సలో చేరారు. పార్టీ మారడంపై మొదట్లో నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తమైనా ఆ తర్వాత కందాల గుడులకు, బడులకు ఆర్థిక సాయం అందిస్తూ తనపై వచ్చిన వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకున్నారు. ఐదేళ్లలో స్థానికంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకున్నానని, తన ఫోన్‌ నంబరును ప్రతి ఊరికి, ప్రతి కుటుంబానికి చెప్పడం ద్వారా అందరికీ చేరువయ్యానని చెబుతున్నారు. వైద్య, విద్య అవసరాలతో పాటు గుడులు, బడులు, మసీదులు, చర్చిలు, నిరుద్యోగులకు ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలకు సొంత డబ్బులను వెచ్చించానని, ఎవరు ఏ కారణంతో మరణించినా ఆర్థిక సాయం అందించానని చెబుతున్నారు. తాను స్థానికుడినని, తనను గెలిపిస్తే ఇక్కడే ఉండి సేవలందిస్తానని అంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులంతా తనకే ఓటు వేస్తారని, దీనికితోడు, తాను వ్యక్తిగతంగా చేసిన సాయం ఓటు బ్యాంకుగా మారుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారు.

పార్టీ బలంపై తమ్మినేని ఆశలు

పాలేరు నియోజకవర్గంలో 1983, 1985, 1994ల్లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం విజయం సాధించింది. 2004లో ఖమ్మం నుంచి గెలిచిన తమ్మినేని వీరభద్రం.. 2009 ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బీఆర్‌ఎ్‌సతో ఏర్పడిన బంధం తెగిపోవడం, కాంగ్రె్‌సతో దోస్తీకి ప్రయత్నించినా ఫలించకపోవడంతో ఒంటరిగానే బరిలో నిలిచారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలే ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నారు. గతంలో తన సారధ్యంలో చేసిన ఉద్యమాలు, తద్వారా ప్రజలకు అందిన ఫలితాలు ఎన్నికల్లో ఓట్లుగా మారతాయని తమ్మినేని భావిస్తున్నారు.

పొంగులేటి బలాలు

గిరిజనులు సహాపార్టీకి బలమైన ఓటుబ్యాంకు

6 గ్యారంటీలకు తోడు మిత్రపక్షంగా సీపీఐ

బలహీనతలు

కిందిస్థాయిలో కొత్త, పాత కాంగ్రెస్‌ కేడర్‌ మధ్య సమన్వయ లోపం

ప్రత్యర్థి కూడా ఆర్థికంగా సమవుజ్జీ కావడం

టీడీపీ సానుభూతి ఓటు బ్యాంకును పూర్తిస్థాయిలో అనుకూలంగా మలచుకోలేకపోవడం

కందాల ఉపేందర్‌రెడ్డి బలాలు

  • ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు

  • నియోజకవర్గానికి చెందిన నేత కావడం

బలహీనతలు

  • పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పలువురు కాంగ్రె్‌సలో చేరడం

  • స్థానిక నాయకత్వంపై కొన్నిచోట్ల వ్యతిరేకత ఉండడం

  • గతంలో కాంగ్రె్‌సలో గెలిచి బీఆర్‌ఎ్‌సలోకి మారడం

తమ్మినేని వీరభద్రం బలాలు

  • గత ప్రజా పోరాటాలు.. పార్టీకి నియోజకవర్గంలో కేడర్‌

  • తన స్వగ్రామం నియోజకవర్గంలోనే ఉండడం

బలహీనతలు

  • పొత్తు విషయంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఊగిసలాట.. చివరికి సీపీఐ మద్దతు కూడా లేకుండా ఒంటరిగా బరిలోకి దిగడం

  • పార్టీ గతంలో ఉన్న పట్టును కోల్పోవడం

Updated Date - 2023-11-26T11:09:15+05:30 IST