Share News

TS Election 2023 Live updates: మరికాసేపట్లో తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్..

ABN , First Publish Date - 2023-11-30T06:06:47+05:30 IST

రాబోయే ఐదేళ్ల పాలనకు అంకురార్పణ మొదలైంది. తలరాతను మార్చే ఓటు వేయడానికి తెలంగాణ ఓటరు తరలి వెళ్తున్నాడు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కొనసాగించడమా!? దానిని మార్చి.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వడమా!? లేక.. బీసీ సీఎం నినాదంతో ముందుకు వచ్చిన బీజేపీని ఆదరించడమా!? తన తీర్పు చెప్పేందుకు తెలంగాణ సిద్ధమైంది.

TS Election 2023 Live updates:  మరికాసేపట్లో తెలంగాణ వ్యాప్తంగా మాక్ పోలింగ్..

Live News & Update

  • 2023-11-29T06:08:00+05:30

    • మరికాసేపట్లో తెలంగాణ వ్యాప్తంగా మొదలుకానున్న మాక్ పోలింగ్

    • ఒక్కో బూత్‌లో 50 ఓట్లతో మాక్ పోలింగ్

  • 2023-11-29T06:02:00+05:30

    రాబోయే ఐదేళ్ల పాలనకు అంకురార్పణ మొదలైంది. తలరాతను మార్చే ఓటు వేయడానికి తెలంగాణ ఓటరు తరలి వెళ్తున్నాడు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కొనసాగించడమా!? దానిని మార్చి.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వడమా!? లేక.. బీసీ సీఎం నినాదంతో ముందుకు వచ్చిన బీజేపీని ఆదరించడమా!? తన తీర్పు చెప్పేందుకు తెలంగాణ సిద్ధమైంది. మరికొద్ది సేపట్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మొదలు కానుంది. 7 గంటలకు మొదలై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని బూత్‌ల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఇప్పటికే పట్టణాలు, నగరాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్లారు.

    12 వేల సమస్యాత్మక కేంద్రాలు

    రాష్ట్రవ్యాప్తంగా 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వాటిలో 12 వేలకుపైగా సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వీటిలో అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ఐదంచెల భద్రత, సమస్యాత్మక కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 600 పోలింగ్‌ కేంద్రాలను గుర్తించిన ఎన్నికల సంఘం.. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగించే విధంగా ఏర్పాట్లు చేసింది.

    ప్రతి నియోజకవర్గంలో యువ ఓటర్లను ఆకర్షించేలా మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా 644 మోడల్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. వాటిలో 120 కేంద్రాలను దివ్యాంగులు, 587 కేంద్రాలను మహిళలకు కేటాయించారు. దివ్యాంగుల కోసం 21,686 వీల్‌ చైర్లను సిద్ధం చేసింది. 80 ఏళ్లు పైబడిన వారికి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తోంది. దృష్టి లోపం ఉన్న వారికి బ్రెయిలీ లిపిలోనూ ఓటర్లు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు అందజేస్తోంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టగా.. 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ జరగనుంది. ఎన్నికల విధుల్లో దాదాపు 2.5 లక్షల మంది సిబ్బంది, 55 వేల మంది తెలంగాణ పోలీసులు, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు భద్రతా ఏర్పాట్లలో పాల్పంచుకుంటున్నారు. అలాగే, 375 కేంద్ర (సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఇండో టిబెటన్‌ బోర్డర్‌) భద్రతా బృందాలు రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్నాయి.