తెలంగాణను నాశనం చేస్తున్న కేసీఆర్: ఛుగ్
ABN , First Publish Date - 2023-04-07T02:39:52+05:30 IST
తెలంగాణను నాశనం చేస్తున్న కేసీఆర్: ఛుగ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): అవినీతి, కుంభకోణాలతో సీఎం కేసీఆర్ తెలంగాణను నాశనం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ ఆరోపించారు. ఈ మేరకు ‘ తెలంగాణ కా ఖజానా’ పేరిట ఓ యానిమేషన్ వీడియోను ఆయన బుధవారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్‌ను పోలిన యానిమేషన్ క్యారెక్టర్లతో 1.35 నిముషాల నిడివి ఉన్న ఈ వీడియోను రూపొందించారు. కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులను సంక్షేమ పథకాల పేరిట కేసీఆర్ తన సొంత ఖజానాలో వేసుకుంటున్నారంటూ ఈ వీడియోలో చూపించారు. ఖజనాలోని ధనరాశులను మీద పోసుకుంటున్న కవిత.. ఫోన్ కాల్స్ మాట్లాడం అయ్యాక మొబైల్స్‌ను విసిరేసినట్టు చూపించారు. అనంతరం ఆ ధనరాశులను మీద పోసుకుంటున్న కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కంటున్నట్టు, ఆ సొమ్ముతోనే జాతీయపార్టీని పెట్టినట్టు చూపించారు. కవిత, కేజ్రీవాల్, భగవంత్ మాన్ పాత్రలు చప్పట్లతో ఆ పార్టీని స్వాగతిస్తుండుగా.. డిటెక్టివ్ వేషధారణలోని వ్యక్తి(ఈడీ) వెనుక నుంచి కవిత భుజంపై చేయి వేసి బేడీలు చూపిస్తాడు. దీంతో కవిత పాత్ర షాక్‌కు గురువ్వగా వీడియో ముగుస్తుంది.