Khammam: ఒక పిల్లాడికి మూడేళ్లు.. మరో పిల్లాడికి ఏడాది.. ఈ అమ్మానాన్నకు మనసెలా వచ్చిందో..!
ABN , First Publish Date - 2023-06-08T17:32:28+05:30 IST
కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం చివరకు వారి ప్రాణాలను తీసింది. ఒక్క రోజు వ్యవధిలో వారి బలవన్మరణానికి కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం జానకీపురం గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివీ.
క్షణికావేశం ఇద్దరి ప్రాణాలు తీసింది..
రోజు వ్యవధిలో ఆత్మహత్య చేసుకున్న దంపతులు
భద్రాద్రి జిల్లా జానకీపురంలో విషాదం
అన్నపురెడ్డిపల్లి: కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం చివరకు వారి ప్రాణాలను తీసింది. ఒక్క రోజు వ్యవధిలో వారి బలవన్మరణానికి కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం జానకీపురం గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటన వివరాలివీ. జానకీపురం గ్రామానికి చెందిన కోలా అఖిల(21), కోలా వెంకటేశ్వరరావు(28) దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల భార్యాభర్తల మధ్య కలహాలు మొదలవగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపం చెందిన అఖిల మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
భార్య మృతిని తట్టుకోలేకపోయిన వెంకటేశ్వర్లు మంగళవారం సాయంత్రం పురుగుల మందు తాగగా.. కుటుంబ సభ్యులు ఆయన్ను కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. క్షణికావేశంలో ఆ దంపతులు తీసుకున్న నిర్ణయానికి వారి కుమారులు మూడేళ్ల వయసున్న నరేంద్రబాబు, ఏడాది వయసున్న అక్షిత్ కుమార్ తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో దంపతలు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. అన్నపురెడ్డిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒకేసారి తల్లిదండ్రుల మృతితో ఆ చిన్నారులు అనాథలు అయ్యారు.