Bhatti Vikramarka: ‘భట్టి’ పాదయాత్రకు విరామం
ABN , First Publish Date - 2023-06-21T21:33:27+05:30 IST
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు బుధవారం విరామం ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా కేతేపల్లిలో మంగళవారం ఆయన వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయి పాదయాత్రకు విరామం ఇచ్చారు.
నల్లగొండ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు బుధవారం విరామం ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా నల్లగొండ జిల్లా కేతేపల్లిలో మంగళవారం ఆయన వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయి పాదయాత్రకు విరామం ఇచ్చారు. 101 డీగ్రీల జ్వరం, తీవ్ర డీహైడ్రేషన్‌కు గురి కావడంతో సూర్యాపేట నుంచి వైద్యులను రప్పించి మంగళవారం రాత్రి మూడు సెలైన్లు ఎక్కించారు. యాంటీబయటిక్ మాత్రలు ఇచ్చారు. బుధవారం ఉదయం వైద్యులు పరీక్షలు నిర్వహించగా జ్వరం 100 డీగ్రీలకు తగ్గకపోవడంతో మళ్లీ సెలైన్లు ఎక్కించడం ప్రారంభించారు. అస్వస్థత సమాచారం తెలుసుకున్న భట్టి విక్రమార్క భార్య నందిని మంగళవారం సాయంత్రమే పాదయాత్ర శిబిరం వద్దకు చేరుకుని సపర్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పీసీసీ నాయకుడు పటేల్ రమేష్‌రెడ్డి శిబిరం వద్దే ఉండి వైద్య సహాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇంకా నీరసం తగ్గకపోవడం, జ్వరం వస్తున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం వరకు పాదయాత్రకు బ్రేక్ పడే అవకాశం ఉంది.