Chicken waste: చికెన్ వ్యర్థాలు @ రూ.కోటిన్నర
ABN , Publish Date - Dec 23 , 2023 | 01:51 PM
ఖమ్మం నగరపాలకసంస్థ పరిధిలోని చికెన్ దుకాణాల(Chicken shops) నుంచి వ్యర్ధాల సేకరణకు సంబంధించిన టెండర్‌ను రికార్డుస్థాయిలో దక్కించుకున్నారు.
- రికార్డు స్థాయిలో వేస్టేజీ సేకరణ వేలం
- రూ.1.55కోట్లకు పాట దక్కించుకున్న గద్వాల వాసి
- గతంకంటే మూడు రెట్లకు పైగా అధికం
ఖమ్మం: ఖమ్మం నగరపాలకసంస్థ పరిధిలోని చికెన్ దుకాణాల(Chicken shops) నుంచి వ్యర్ధాల సేకరణకు సంబంధించిన టెండర్‌ను రికార్డుస్థాయిలో దక్కించుకున్నారు. జోగులాంబ జిల్లా గద్వాలకు చెందిన బాలరాజు అనే వ్యక్తి ఏకంగా రూ.కోటి 55లక్షల 60వేలకు టెండర్‌ను దక్కించుకున్నారు. గతంలో ఈ టెండర్‌ను రూ.44లక్షల 44వేలకు ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. ప్రస్తుతం మూడురెట్లు అంద నంగా పాడారు. శుక్రవారం ఖమ్మం నగరపాలకసంస్థ కార్యాలయంలో బహిరంగవేలం నిర్వహించగా, ఆరుగురు పాల్గొన్నారు. నగరపాలకసంస్థ సహాయ కమిషనర్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగవేలంలో రాయల్టీ పాటగా రూ.40లక్షలు నిర్ణయించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాలకు చెందిన బాలరాజు రు.కోటి 55లక్షల 60వేలకు పాటను దక్కించుకున్నారు.
200 పైగా చికెన్ దుకాణాల నుంచి
టెండర్ పొందిన కాంట్రాక్టర్ ఖమ్మం నగరపాలకసంస్థ పరిధిలోని 200 పైగా ఉన్న చికెన్ దుకాణాల నుంచి వ్యర్ధాలను సేకరిస్తారు. వాటిని సాంకేతిక పద్ధతిలో పొడిగా మార్చి చేపల దాణాగా తయారు చేస్తారు. అనంతరం చేపల చెరువుల యాజమా నులకు విక్రయిస్తారు. ఇలా చేసినందుకు నగరపాలకసంస్థకు రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ నిమిత్తం టెండర్లను ఆహ్వానించి బహిరంగవేలం నిర్వహించగా ఊహిం చినదానికంటే ఎక్కువ రాయల్టీ లభించింది.