Yadadri: యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

ABN , First Publish Date - 2023-03-05T20:26:24+05:30 IST

యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం యాత్రాజనుల పూజల సందడి నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తజనులు

Yadadri: యాదగిరిక్షేత్రంలో భక్తుల కోలాహలం

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం యాత్రాజనుల పూజల సందడి నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తజనులు ఇష్టదైవాలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండకింద లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కొండపైకి చేరుకుని ధర్మదర్శనాలు, ప్రత్యేక దర్శనాల క్యూలైన్లలో బారులు తీరారు. ధర్మదర్శనాలకు సుమారు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటల సమయం పట్టిందని భక్తులు (Devotees) తెలిపారు. స్వామివారిని సుమారు 35వేల మందికి పైగా యాత్రీకులు దర్శించుకున్నట్టు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పట్టణం, ఆలయ ఘాట్‌రోడ్‌ ప్రాంతాల్లో వాహనాల రద్దీ నెలకొంది. ప్రధానాలయం, ప్రసాదాల విక్రయశాల, ఆలయ తిరువీధులు భక్తుల సంచారంతో సందడిగా కనిపించాయి.

స్వయంభు పాంచనారసింహుడికి నిత్య పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో నిత్యారాధనలు ఆరంభించిన ఆచార్యులు రాత్రి వేళ మహానివేదన, శయనోత్సవ పర్వాలతో ఆలయ ద్వారబంధనం చేశారు. గర్భాలయంలోని స్వయంభువులకు అభిషేకం, అర్చనలు, ప్రాకార మండపంలో హోమం, నిత్య తిరుకల్యాణోత్సవ పర్వాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్య పూజలు, నిత్య రుద్రహవనం, కొండకింద వ్రత మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. కాగా, వివిధ విభాగాల ద్వారా రూ.48,70,521 ఆలయ ఖజానాకు ఆదాయం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2023-03-05T20:26:24+05:30 IST