Padayatra: రేవంత్ పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ నేతల డిమాండ్
ABN , First Publish Date - 2023-01-21T16:31:51+05:30 IST
గాంధీభవన్‌లో టీపీసీసీ (TPCC) విస్తృతస్థాయి భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి..
హైదరాబాద్: గాంధీభవన్‌లో టీపీసీసీ (TPCC) విస్తృతస్థాయి భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర (Padayatra) చేయాలని నేతలు డిమాండ్ చేశారు. పాదయాత్రతోనే పార్టీకి మనుగడ ఉంటుందని మాజీమంత్రి గడ్డం ప్రసాద్ తెలిపారు. వైఎస్సార్ పాదయాత్రతో గతంలో అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని మాజీమంత్రి కొండా సురేఖ తెలిపారు. పాదయాత్రతో ప్రజల్లోకి వేళ్తేనే కాంగ్రెస్కు మంచి రోజులు వస్తాయని చెప్పారు. పీసీసీ కానీ, సీఎల్పీ కానీ లేదా ఇరువురు కలిసైనా.. పాదయాత్ర చేయాలని ఎమ్మెల్యే పొడెం వీరయ్య కోరారు. మాజీమంత్రి గీతారెడ్డి కూడా పాదయాత్ర చేయాలని కోరారు.
గతంలో రేవంత్ పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేశారు. జనవరి 26 నుండి జూన్ 2 వరకు పాదయాత్ర చేయబోతున్నట్లుగా ప్రకటించేశారు కూడా. ఏకపక్షంగా అలా ఎలా ప్రకటించేస్తారు అని సీనియర్లు గగ్గోలు పెడుతున్నా.. రేవంత్ అండ్ టీం వారి ఏర్పాట్లలో వారు ఉండిపోయారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్ఫూర్తితో రోజుకు 19కి.మీ పాదయాత్ర చేయాలని, దాదాపు 120 రోజులకు పైగా పాదయాత్ర చేయాలని.. తెలంగాణలోని ప్రతిమూలను టచ్ చేసేలా ఉండేలా రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. రేవంత్ యాత్ర తెరపైకి వచ్చినప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు తాము యాత్ర చేస్తామని, అనుమతి ఇవ్వాలని ముందుకొచ్చారు. కానీ ఇప్పుడు కోమటిరెడ్డి రేసులో వెనకబడ్డా... రేవంత్‌రెడ్డితో పాటు భట్టికి కలిసి పర్మిషన్ వస్తుందన్న ఆశలో సీనియర్లున్నారు.