Share News

Kaleshwaram Project: కాంగ్రెస్‌కు పేరొస్తుందని కేసీఆర్ కుట్ర చేశారు.. కాంగ్రెస్ నేతలు ఆరోపణలు

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:59 PM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. మధ్యాహ్నానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యారేజీ వద్దకు...

Kaleshwaram Project: కాంగ్రెస్‌కు పేరొస్తుందని కేసీఆర్ కుట్ర చేశారు.. కాంగ్రెస్ నేతలు ఆరోపణలు

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని శుక్రవారం ఐదుగురు మంత్రుల బృందం పరిశీలించింది. మధ్యాహ్నానికి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా.. మంత్రులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించినప్పటి నుంచే ఎన్నో అనుమానాలు ఉన్నాయని, తాము చెబుతూ వచ్చిన విషయాలే నిజమయ్యాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ గత ప్రభుత్వానికి మానాసపుత్రిక అయ్యిందని వ్యాఖ్యానించారు.

కోమటి రెడ్డి వెంకటరెడ్డి

తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు కడితే రూ.40 వేల కోట్లు ఆదా అయ్యేవని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఇక్కడే ఎందుకు చేపట్టారో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్‌ను ఇంజనీర్ ఇన్‌చీఫ్ చేశారా? అని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టిన సమయంలోనే మీరు లీవ్ పెట్టి ఉండాల్సిందని ఇంజనీర్ ఇన్‌చీఫ్‌పై ఫైర్ అయ్యారు. అసెంబుల్డ్ మోటార్లు తెచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. అప్పటి ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. కాంగ్రెసుకు పేరు వస్తుందని కేసీఆర్ కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా ఒక విఫల ప్రయోగమని దుయ్యబట్టారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి

152 మీటర్ల లెవల్‌లో తుమ్మడి హెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించేందుకు అప్పటి కాంగ్రెస్ సీఎం రాజశేఖరరెడ్డి కృషి చేశారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని, చర్చల దశలో ఉండగానే పరిస్థితులు మారిపోయాయని అన్నారు. ఆ తర్వాత 148 మీటర్ల ఎత్తులో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని, డిజైన్ లోపం వల్లే కాళేశ్వరం కుంగిందని పేర్కొన్నారు. ఆనాడు జాగ్రత్తలు తీసుకొని ఉంటే, ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారని, ఇది ఒకట్రెండు పిల్లర్లతో ఆగిపోదని తెలిపారు. ప్రాజెక్టు అంతా నాణ్యతా లోపమేనని వ్యాఖ్యానించారు. ఇది అప్పులు చేసి కట్టిన ప్రాజెక్టు అని, పంపులు మునగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. వందలాది కోట్ల ప్రజాధనం వృధా అయ్యిందని, దీనికి కారణం ఎవరని నిలదీశారు.


ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్

కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని, బ్యారేజీల్లో స్టోరేజీ తక్కువగా ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ధవళేశ్వరం బ్యారేజీలో 3-4 టీఎంసీలకు ఎక్కువగా నిల్వ ఉండవన్నారు. కానీ కాళేశ్వరంలో 16 టీఎంసీల నీరు ఎలా నిల్వ చేయాలనుకున్నారో తెలియదని చెప్పారు. రాజకీయ కోణాలు, ఇతర కోణాల కారణంగా ప్రాజెక్టులో లోపాలున్నాయన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరుతామన్నారు. మేడిగడ్డ కుంగినప్పటి నుంచి ఇప్పటివరకూ కేసీఆర్ స్పందించలేదన్నారు. రూ.80 కోట్లున్న ప్రాజెక్టు వ్యయాన్ని లక్షన్నర కోట్లకు పెంచారన్నారు. మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజీ అయ్యిందని పేర్కొన్నారు. దీనిపై తాము న్యాయ విచారణ జరుపుతామని గతంలోనే చెప్పామన్నారు.

పొన్నం ప్రభాకర్

కాళేశ్వరం ప్రాజెక్టు గత ప్రభుత్వానికి మానసపుత్రిక అయ్యిందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కనీసం చూసేందుకు కూడా వీలు లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టారని ప్రచారం చేశారన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి ఫలితం లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో రైతాంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇదే సమయంలో ఎమ్మెల్యే వివేక్ సైతం స్పందించారు. తుమ్మడి హెట్టి దగ్గర నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలమయంగా తయారైందని విమర్శించారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ సమస్యకు పరిష్కారం చూపాలని, బ్యాక్ వాటర్‌లో పంటలు కోల్పోతున్న రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.

Updated Date - Dec 29 , 2023 | 03:59 PM