Share News

Covid: ‘ఫీవర్‌’ ఆస్పత్రిలో కరోనా ట్రీట్‌మెంట్‌.. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలి

ABN , Publish Date - Dec 21 , 2023 | 10:13 AM

కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనాను సమర్థవంతంగా

Covid: ‘ఫీవర్‌’ ఆస్పత్రిలో కరోనా ట్రీట్‌మెంట్‌.. ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలి

- అందుబాటులోకి 20 బెడ్‌లు

- అప్రమత్తంగా ఉండాలని సూచన

బర్కత్‌ఫుర(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మెరుగైన వైద్యం అందించేందుకు నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రి(Fever Hospital) సిద్ధమైంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, ప్రజలు మాస్క్‌లు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫీవర్‌ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు చేస్తున్నారు. గడిచిన ఏడు నెలల్లో కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు చేయలేదు. మళ్లీ కరోనా కేసులు నమోదవుతుండడంతో పరీక్షలు చేసేందుకు ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు అందుబాటులో ఉండగా రాపిడ్‌ టెస్ట్‌ కిట్లను తెప్పించనున్నారు. అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. కరోనా బాధితులకు పూర్తి వైద్యం అందించేందుకు ఆస్పత్రిలోని 7వ వార్డులో 20 బెడ్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఆక్సిజన్‌ సౌకర్యం కూడా ఉంది. జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

మాస్క్‌లు ధరించాలి..

city7.jpg

కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌(Mask)లు ధరించాలి. వృద్ధులు, గర్భిణులు చిన్నారులు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండాలి. గుంపుగా ఉన్న వారి వద్దకు వెళ్లవద్దు. చేతులు శుభ్రంగా కడుక్కోవడంతో పాటు శానిటైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలి. జ్వరం తగ్గకపోవవడం, విపరీతమైన దగ్గు, జలుబు, ముక్కు నుంచి నీరు కారడం ఊపిరి సరిగా ఆడకపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్న వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. పోషక విలువలు గల వేడి ఆహారాన్ని తీసుకోవాలి. చిన్న పిల్లలు, వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలి. తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చి వైద్యులను సంప్రదించి మెరుగైన వైద్యం పొందవచ్చు.

- డాక్టర్‌ కె.శంకర్‌, ఫీవర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Updated Date - Dec 21 , 2023 | 10:13 AM