Covid: ఆ తర్వాతే నిర్ధారణ.. కరోనాను గుర్తించడంలో ఆలస్యం
ABN , Publish Date - Dec 28 , 2023 | 10:47 AM
కోమార్బిటిస్(ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు) కొవిడ్ పరీక్షలు చేయించుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీరికి కొవిడ్ వస్తే తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.
- న్యుమోనియా చిన్నారుల్లోనూ అదే పరిస్థితి
- సాధారణ లక్షణాలను పట్టించుకోని వైనం
- ఏదో జబ్బుతో ఆస్పత్రికి వచ్చాకే పరీక్షలు
దూద్‌బౌలికి చెందిన సుభాన్ గుండె జబ్బుతో ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)లో చేరారు. ఆయనకు పరీక్ష చేస్తే కొవిడ్ నిర్ధారణ అయ్యింది. అప్పటికే ఆయన మృత్యువాత పడ్డారు. కిషన్‌బాగ్ నివాసికి శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు పరీక్ష చేస్తే కొవిడ్ ఉన్నట్లు తేలింది. ఫలితం వచ్చేసరికి ఆయన చనిపోయారు. నిలోఫర్ ఆస్పత్రిలో న్యూమోనియాతో చికిత్స పొందుతున్న 14 నెలల బాబుకు, రెండు నెలల చిన్నారికి, మరో ఇద్దరు పిల్లలకు కొవిడ్ పరీక్షలు చేస్తే పాజిటివ్ వచ్చింది.
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): కోమార్బిటిస్(ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు) కొవిడ్ పరీక్షలు చేయించుకుంటే ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వీరికి కొవిడ్ వస్తే తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. మూత్రపిండాలు, కార్డియాలజీ, కాలేయం, కేన్సర్ వంటి జబ్బులు ఉంటే కొవిడ్ పాజిటివ్ ఇబ్బంది కలిగిస్తుందంటున్నారు. ఒకవైపు అప్పటికే ఉన్న జబ్బులు.. మరోవైపు కొవిడ్‌తో పోరాటం చేయడంలో అలసిపోతుండడంతో వారి ఊపిరి ఆగిపోతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడంతో..
కోమార్బిటిస్ రోగులకు కొవిడ్ రావడంతో శక్తిహీనులవుతున్నారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండడంతో మెల్లమెల్లగా వారి అవయవాలు శక్తిహీనమై పనితీరు మందగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో అవయవం ఫెయిల్ కావడంతో మరణానికి దారి తీస్తుందని చెబుతున్నారు. కొవిడ్ మొదటి, రెండో దశలలో చనిపోయిన వారిలో ఎక్కువగా కోమార్బిటిస్ బాధితులేనని వైద్యులు పేర్కొంటున్నారు.
కొవిడ్ ప్రభావంతో..
వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీనికితోడు వారిలో బీపీ, మధుమేహం ఉన్న వారు కూడా ఉంటారు. ఇలాంటి వారు కొవిడ్ లాంటి వైర్‌సను ఎదుర్కొనే శక్తి ఉండదు. కొవిడ్ ప్రభావంతో మరింత శక్తి హీనులవుతారు.
ముందే అలారమ్ వస్తుంది
కోమార్బిటిస్ బాధితులకు ముందే కొవిడ్ అలార మ్ వస్తుంది. జలుబు, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఉత్పన్నమవుతాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు. అంతకు ముందు ఉన్న జబ్బుల వల్లనే అనే అనుమానంతో ఉంటారు. ఆస్పత్రికి వచ్చిన కొందరు బాధితులకు కొవిడ్ పరీక్ష చేయడం లేదు. కోమార్బిటిస్ కు సంబంధించిన మం దులే ఇస్తున్నారు. దీంతో కొవిడ్‌ను గుర్తించి నియంత్రించే చికిత్స అందకపోవడంతో ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదముంది. కొందరిలో లక్షణాలు లేకుండా కొవిడ్ ఉండొచ్చు. ఆస్పత్రిలో అడ్మిట్ చేసే ప్రతీ రోగికి కొవిడ్ పరీక్షలు చేయడం మంచిది. వైద్యుల సలహా మేరకు బూస్టర్ డో సులు వేసుకోవాలి. మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం, సాధారణ లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించుకోవడం మంచిది.
- డాక్టర్ వెంకట్ రమేష్,
ఇంటర్నల్ మెడిసిన్, అపోలో ఆస్పత్రి