Narayana: వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌కు మేము వ్యతిరేకం
ABN , First Publish Date - 2023-09-01T14:30:02+05:30 IST
దేశంలో దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో మోడీ ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: దేశంలో దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో మోడీ (PM Modi) ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని అన్నారు. వన్ నేషన్, వన్ పార్టీ, వన్ పర్సన్ ..ఆర్ఎస్ఎస్ అన్నట్లుగా కేంద్ర వైఖరి ఉందన్నారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలని తెలిపారు. వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌కు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజ్యాంగం అక్కర్లేదు.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ ప్రక్రియ అయినా నిర్వహించాలని అన్నారు. పేరు మోసిన పెద్దవాళ్లను అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. జమిలి ఎన్నికలపై చర్చ జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారన్నారు. ఇండియా కూటమి బలపడకుండా ముందుగా తాము బయటపడాలని బీజేపీ చూస్తుందని ఆయన విమర్శించారు.
ఇండియా కూటమి అంటే బీజేపీ భయపడుతోందన్నారు. అవినీతి బయట పడకుండా జీ-20 సమావేశాలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. చంద్రాయన్ 3కి శివశక్తి అని పేరు పెట్టి మతాన్ని వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాలలో వివిధ పరిస్థితులు ఉన్నాయన్నారు. జమ్మూకాశ్మీర్, మణిపూర్‌లో పరిస్థితులు వేరుగా ఉన్నాయన్నారు. మణిపూర్‌లో డబుల్ ఇంజన్ పడిపోతుందని.. ప్రతిపక్షాలు బలపడుతున్నాయని తెలిపారు. జమిలి ఎన్నికల కోసం అంతర్గత కమిటీ పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రామ్ నాథ్ కొవింద్‌ను ముందు పెట్టాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఈ దేశం ఎలా పుట్టిందో తెలిస్తే అప్పుడు జమిలి ఎన్నికల గురించి మాట్లాడాలన్నారు. బీజేపీకి స్వతంత్ర పోరాటంతో సంబంధం లేదన్నారు. దేశాన్ని ముక్కలు చేసేలా బీజేపీ విధానాలున్నాయని నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.