తెలంగాణ హోంమంత్రికి ఢిల్లీ పోలీసులు షాక్‌

ABN , First Publish Date - 2023-05-04T15:33:35+05:30 IST

ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని (BRS Central Office) ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ (CM KCR) అట్టహాసంగా ప్రారంభించారు.

తెలంగాణ హోంమంత్రికి ఢిల్లీ పోలీసులు షాక్‌

హైదరాబాద్: ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని (BRS Central Office) ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ (CM KCR) అట్టహాసంగా ప్రారంభించారు. అనుకున్న ముహూర్తానికే అంటే సరిగ్గా మధ్యాహ్నం 1:05 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. హోంమంత్రి మహమూద్‌‌ అలీ (Home Minister Mahmood Ali)కి కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పార్టీ ఆదేశాల ప్రకారం ఢిల్లీ వెళ్లారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లిన హోంమత్రి ఎయిర్ పోర్టు నుంచి కారులో పార్టీ ఆఫీసుకు బయలుదేరారు. అయితే మహమూద్‌ అలీకి ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. అంతేకాదు ఆయన కారును అడ్డుకుని నడుచుకుంటూ వెళ్లాలని చెప్పారు. పాపం ఢిల్లీ పోలీసులకు మహమూద్‌ అలీ.. తెలంగాణ రాష్ట్రానికి హోం మంత్రి అనే విషయం తెలియదు. సాదారణ పౌరుడు అనుకుని ఆయనపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఇదంతా అవగాహనలేక పోవడం వల్ల జరిగిన పొరపాటు. ఇంతలోనే తాను హోంమంత్రిని అని చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు. పొరపాటును సరిదిద్దుకుని ఆయనను అనుమతించారు.

ఇలాంటి అవమానాలు మహమూద్‌ అలీకి ఢిల్లీలోనే కాదు... స్వంత రాష్ట్రం, అది కూడా ప్రగతిభవన్‌లో గతంలో ఎదురైంది. ఆ సమయంలో కరోనా తీవ్రంగా ఉంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు పంపారు. మహమూద్‌ అలీ కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు నేరుగా ప్రగతిభవన్ వెళ్లారు. అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. ఢిల్లీలో చెప్పినట్లే తాను హోంమంత్రినని మహమూద్ అలీ చెప్పారు. అయినా పోలీసులు ఆయనను అనుమతించలేదు. ఇక ఏమీ చేయలేక సమావేశంలో పాల్గొనకుండా ఆయన వెనుతిరిగారు.

ఇదిలావుంటే ఢిల్లీలో బీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన మీడియాకు బీఆర్ఎస్ కార్యాలయంలోకి అనుమతి లభించలేదు. అధికారుల ఆదేశాల మేరకు మీడియాను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు నుంచి పోలీసులు బయటకు పంపించివేశారు. పార్టీ ఆఫీస్ ప్రాంగణంలో కూడా మీడియా వాళ్ళు ఎవరు ఉండవద్దంటూ హుకుం జారీ చేశారు. పైనుంచి ఆదేశాలు వచ్చాయని... అందుకోసమే మీడియాకు నో ఎంట్రీ అని ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది చెబుతోంది. ఈ ఆంక్షలపై మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.

Updated Date - 2023-05-04T15:33:35+05:30 IST