Telangana Results: పీకేను వదులుకుని కేసీఆర్ తప్పు చేశారా? ఆయన ఉండుంటే బీఆర్‌ఎస్ గెలిచేదా?
ABN , First Publish Date - 2023-12-03T16:59:10+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు మూడోసారి కాంగ్రెస్ వైపు మొగ్గారు. నిజానికి ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగానే కనిపించింది.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు మూడోసారి కాంగ్రెస్ (Congress) వైపు మొగ్గారు. నిజానికి ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా స్పష్టంగానే కనిపించింది. ఆ విషయం ప్రభుత్వ అధినేతలు చాలా ముందుగానే పసిగట్టి ఎన్నికల స్పెషలిస్ట్ ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) సహాయం కోరారు. కేసీఆర్ (KCR) కోరిక మేరకు ప్రశాంత్ కిషోర్ కూడా బీఆర్‌ఎస్ తరఫున పని చేయడానికి ముందుకు వచ్చారు. తన టీమ్‌తో కలిసి పని మొదలెట్టారు. అయితే బీఆర్‌ఎస్-ఐ ప్యాక్ డీల్ మధ్యలోనే ఆగిపోయింది (Telangana Results).
ఏం జరిగిందో ఏమో కానీ తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ పని ఎక్కువ రోజుల సాగలేదు. కేసీఆర్‌కు ఎన్నికల వ్యూహాల గురించి వివరించే స్థాయి ఎవరికీ లేదని, రాజకీయాల్లో తమ అధినేతను మించిన వ్యూహకర్తలు ఎవరూ లేరని అప్పట్లో గులాబీ నేతలు చెప్పుకొచ్చారు. హ్యాట్రిక్ పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ఇచ్చిన కిక్‌తో తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు రెట్టించిన ఉత్సాహంతో పని చేశారు. గాలి మారడాన్ని గమనించిన కేసీఆర్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కూడా పీకేను పిలిపించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏం చేసినా లాభం లేదని పీకే చేతులెత్తేసినట్టు సమాచారం.
ప్రస్తుతం పరిస్థితి చేయి దాటిపోయిందని, ఇప్పుడు ఎలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకున్నా ఉపయోగం ఉండదని కేసీఆర్‌కు పీకే వివరించారట. ఏదేమైనా పీకేను మొదటి నుంచి పని చేయించినట్టైతే తమ పార్టీ మూడోసారి కచ్చితంగా గెలిచేదని గులాబీ నేతలు ఇప్పుడు అనుకుంటున్నారు. అతి విశ్వాసం వల్ల మొదటికే మోసం వచ్చిందని బాధపడుతున్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పీకే వచ్చినా చేసేదేం ఉండదని, తెలంగాణ ప్రజలు స్పష్టంగా మార్పు కోరుకున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.