Guntakandla Jagadish Reddy: యావత్ భారతదేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం
ABN , First Publish Date - 2023-02-09T23:18:16+05:30 IST
యావత్ భారతదేశానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: మోడీ మోసం బట్టబయలు అయ్యిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. జాతీయత పేరుతో ఆయన దేశద్రోహనికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఒకరిద్దరికి దేశ సంపదను కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ ప్రణాళికలు రూపొందించిందని ఆయన ఆరోపించారు. ఆ విషయాన్ని దేశప్రజలు గ్రహిస్తున్నారని సరయిన సమయంలో గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమౌతున్నారని ఆయన చెప్పారు.
బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో నకేరేకెల్ నియోజకవర్గ పరిధిలోని వందల మంది కాంగ్రెస్, సిపిఎం నాయకులు, కార్యకర్తలు బీ ఆర్ యస్‌లో చేరారు. ముగ్గురు యంపీటీసీలతో సహా ఓ ఉప సర్పంచ్, సిపిఎం సీనియర్ నేత పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. పార్టీలో చేరిన యంపీటీసీలలో చందుపట్ల యంపీటీసీ ఇమడపాక లక్ష్మీ వెంకన్న, చందంపల్లి యంపీటీసీ బోయిళ్ళ శేఖర్, ఈదులూరు యంపీటీసీ తవిడబోయిన భవాని లతో పాటు నోముల ఉప సర్పంచ్ శ్రీనివాస రెడ్డి, సిపిఎం సీనియర్ నేత భీమన బోయిన యాదగిరి తదితరులు ఉన్నారు. నకేరేకెల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారతదేశానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు. మోడీపై విశ్వసనీయత కొల్పయిన దేశ ప్రజలు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు బీ ఆర్ యస్ వైపు చూస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాగుతున్న పాలనపై దేశ ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. వ్యవసాయ రంగంతో పాటు విద్యుత్, సాగు నీరు, త్రాగునీరు రంగాలలో సాధించిన విజయాలతో పాటు ఇక్కడ అమలౌతున్న సంక్షేమ పథకాలపై ఆసక్తిని పెంచుకున్న దేశ ప్రజలు రేపటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీ ఆర్ యస్ పార్టీకి పట్టం కట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.