Holi festival: హోలీ పండుగ రోజు విషాదం
ABN , First Publish Date - 2023-03-07T21:14:57+05:30 IST
కరీంనగర్ జిల్లా (Karimnagar District) కేంద్రం సమీపంలోని మానేరు నదికి స్నానానికి వెళ్లిన బత్తిని వీరాంజనేయులు(16), గొనపల్లి సంతోష్(13), వల్లెపు అనిల్(14) అనే విద్యార్థులు నీటిలో..
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా (Karimnagar District) కేంద్రం సమీపంలోని మానేరు నదికి స్నానానికి వెళ్లిన బత్తిని వీరాంజనేయులు(16), గొనపల్లి సంతోష్(13), వల్లెపు అనిల్(14) అనే విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. వీరి కుటుంబాలు ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చి 15 సంవత్సరాలుగా కరీంనగర్‌లోని హౌసింగ్ బోర్డులో ఉంటున్నాయి. వీరి తల్లిదండ్రులు కూలీపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం హోలీ (Holi) ఆడిన అనంతరం వీరాంజనేయులు, సంతోష్, అనిల్ స్నేహితులతో కలిసి మానేరు నదిలోని తీగల వంతెన వద్దకు స్నానానికి వెళ్లారు. ఓ గుంతలోకి స్నానం చేసేందుకు దిగారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో గుంతలో మునిగి మృతి చెందారు. వారితో వచ్చిన మరో స్నేహితుడు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వచ్చి వారి కోసం గాలించగా ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. తమకు న్యాయం చేయలంటూ విద్యార్థుల కుటుంబ సభ్యులు మృతదేహాలను సంఘటన స్ధలం నుంచి తీసుకువెళ్లకుండా ఆందోళన చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మృతదేహాలను పోస్టుమార్టం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.