Share News

Hyderabad: 7 శాతం ఎక్కువ.. సైబరాబాద్‌లో పెరిగిన నేరాలు.. సైబర్‌ నేరాలదీ అదే దారి

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:22 AM

సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది సైబర్‌ నేరాలు పెరిగాయి. ఇలాంటి నేరాల ద్వారా గతేడాది కంటే ఈ ఏడాది సుమారు 250 శాతం ఎక్కువ డబ్బు పోయింది.

Hyderabad: 7 శాతం ఎక్కువ.. సైబరాబాద్‌లో పెరిగిన నేరాలు.. సైబర్‌ నేరాలదీ అదే దారి

- తగ్గిన మహిళలపై నేరాలు

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ ఏడాది సైబర్‌ నేరాలు పెరిగాయి. ఇలాంటి నేరాల ద్వారా గతేడాది కంటే ఈ ఏడాది సుమారు 250 శాతం ఎక్కువ డబ్బు పోయింది. అలాగే, ఈ కేసులకు సంబంధించి 500శాతం ఎక్కువ డబ్బును పోలీసులు సీజ్‌/ఫ్రీజ్‌ చేసి, రికవరీలో రికార్డు సాధించారు. శనివారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన వార్షిక నేర నివేదికను సీపీ అవినాశ్‌ మహంతి(CP Avinash Mahanty) మీడియాకు విడుదల చేశారు. ముఖ్యంగా వైట్‌ కాలర్‌ నేరాలపై దృష్టి సారించినట్లు వివరించారు. కమిషనరేట్‌ పరిధిలో గతేడాది మొత్తం 27,322 కేసులు నమోదు కాగా, 2023లో 29,156 కేసులు నమోదయ్యాయి. 13 శాతం హత్యలు తగ్గాయి. అయితే, డబ్బుకోసం జరిగిన హత్యలు 43శాతం పెరగడం గమనార్హం. మరోవైపు చోరీలు 14శాతం, రోడ్డు ప్రమాదాలు 11 శాతం తగ్గాయి. విచారణ దశలో 41 శాతం కేసులు పెరిగాయి. గతేడాది 8,129 కేసులుండగా.. ఈ ఏడాది 11,506 కేసులు విచారణలో ఉన్నాయి. దోపిడీలు.. చోరీ కేసులు కాస్త తగ్గాయి. అయితే, పోయిన సొమ్ము మాత్రం పెరిగింది. గతేడాది మొత్తం రూ. 24.10 కోట్లు చోరీ కాగా, ఈ ఏడాది రూ. 24.90 కోట్లు దోపిడీకి గురయ్యాయి. మహిళల విషయంలో గతేడాది 2,489 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 2,356 కేసులు నమోదయ్యాయి. మొత్తం రోడ్డు ప్రమాదాలు గతేడాది 3,224 జరగ్గా, ఈ ఏడాది 3,143 జరిగాయి.

పనితీరుతోనే గుర్తింపు..

అధికారులు సామర్థ్యం.. పనితీరు, పని మీద ఉన్న శ్రద్ధ, క్రమశిక్షణతోనే వారికి గుర్తింపు ఉంటుందని.. పైరవీలు, పోస్టింగులకు తావుండదని సీపీ అవినాశ్‌ మహంతి తెలిపారు. ఇప్పటికే పని చేస్తున్న అధికారులెవరైనా పైరవీలతో వచ్చి ఉంటే చర్యలు తీసుకుంటారా అన్న ప్రశ్నకు.. ఎవరున్నా క్రమశిక్షణ, పారదర్శక న్యాయం లాంటి అంశాల ఆధారంగానే వారిపై చర్యలుంటాయన్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని, వినియోగించే వారిపైనా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం ఈ ఏడాది 44 పెలికాన్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేసి వాటి నిర్వహణకు 88మంది వలంటీర్లను నియమించినట్లు వివరించారు.

న్యూఇయర్‌ వేడుకలకు 30 దరఖాస్తులు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్త ఏడాది వేడుకల నిర్వహణ కోసం ఇప్పటి వరకు 30 దరఖాస్తులు వచ్చాయని సైబరాబాద్‌ సీపీ మహంతి అన్నారు. పరిశీలించి రెండు రోజుల్లో వారికి సమాధానమిస్తామన్నారు. న్యూ ఇయర్‌ వేడకల రోజు పోలీస్‌ బందోబస్తు ఉంటుందని.. డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్ట్‌లూ ముమ్మరం చేస్తామన్నారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదం

ఈ ఏడాదిలో మొత్తం 277 గంజాయి, డ్రగ్స్‌ కేసులు నమోదు చేసి 567మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం రూ. 27.83కోట్లు విలువ చేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసినట్లు, గతేడాదిలో రూ. 12.42 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ స్వాధీనం చేసినట్లు వెల్లడించారు.

Updated Date - Dec 24 , 2023 | 11:22 AM