Electric Shock Deaths: కరెంటు చావులు

ABN , First Publish Date - 2023-02-20T02:57:52+05:30 IST

రాష్ట్రంలో కరెంటు చావులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యుత్‌ సంస్థల్లో పనిచేసేవారితో పాటు సాధారణ ప్రజలు కూడా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మరణిస్తున్నారు. మనుషులతో పాటు రాష్ట్రంలో పశువులు కూడా అధికసంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి.

Electric Shock Deaths: కరెంటు చావులు

మనుషులు, పశువుల మరణాలు రాష్ట్రంలోనే అత్యధికం

విద్యుత్తు ప్రమాదాల్లోనూ టాప్‌

2020-21లో 4676 ప్రమాదాలు

కరెంట్‌ షాక్‌కు 1241 మంది బలి

సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ నివేదిక

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరెంటు చావులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యుత్‌ సంస్థల్లో పనిచేసేవారితో పాటు సాధారణ ప్రజలు కూడా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మరణిస్తున్నారు. మనుషులతో పాటు రాష్ట్రంలో పశువులు కూడా అధికసంఖ్యలో మృత్యువాతపడుతున్నాయి. విద్యుత్‌ ప్రమాదాలు, మనుషులు, పశువుల మరణాలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. 2020-21 సంవత్సరానికి గానూ సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) ప్రకటించిన అఖిల భారత విద్యుత్‌ గణాంకాలు-2022 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నివేదికలోని వివరాల ప్రకారం.... విద్యుత్‌ ప్రమాదాలు, మరణాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలకు సంబంధించిన విద్యుత్‌ ప్రమాదాల్లో మొత్తం 1,241 మంది వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ మరణాలతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో మరో 219 మంది క్షతగాత్రులయ్యారు. 1,062 మరణాలతో మధ్యప్రదేశ్‌, 1,038 మరణాలతో మహారాష్ట్ర ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. వినియోగదారుల ప్రాంగణాల్లో జరిగిన విద్యుత్‌ ప్రమాదాల్లో రాష్ట్రంలో మరో 108 మరణించగా, 22 మంది క్షతగాత్రులయ్యారు.

విద్యుత్‌ ప్రమాదాల్లో దేశం మొత్తంలో 9,021 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, 3,750 మంది క్షతగాత్రులయ్యారు. 2,876 పశువుల మరణాలతో పశువుల మరణాల్లోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. 1,368 పశువుల మరణాలతో రాజస్థాన్‌, 1,211 పశువుల మరణాలతో మధ్యప్రదేశ్‌ రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. దేశంలో మొత్తం 10,758 పశువులు మృత్యువాతపడగా, 227 పశువులు గాయాలపాలయ్యాయి. కాగా విద్యుత్‌ ప్రమాదాల సంఖ్యలోనూ తెలంగాణ తొలి స్థానంలో ఉంది. రాష్ట్రంలో 4,676 ప్రమాదాలు చోటుచేసుకోగా, కర్ణాటకలో 2,935, రాజస్థాన్‌లో 2,726 ప్రమాదాలు జరిగాయి.

తలసరి విద్యుత్‌ వినియోగంలో ఐదో స్థానంలో రాష్ట్రం

తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఐదో స్థానంలో నిలిచింది. 3,137 యూనిట్ల వార్షిక తలసరి విద్యుత్‌ వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 2,200 యూనిట్ల విద్యుత్‌ వినియోగంతో పంజాబ్‌, 2,131 యూనిట్ల వినియోగంతో హరియాణ, 2,048 యూనిట్ల వినియోగంతో గుజరాత్‌ రాష్ట్రాలు వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. 2,012 యూనిట్ల విద్యుత్‌ వినియోగంతో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది. 2019-20లో దేశ తలసరి విద్యుత్‌ వినియోగం 1,208 యూనిట్లుండగా, 2020-21లోలో 1,161 యూనిట్లకు పడిపోయింది.

మొత్తంగా తొమ్మిదో స్థానం...

రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ స్థానం 9కి పడిపోనుంది. ఓవరాల్‌గా 10,478 యూనిట్ల తలసరి విద్యుత్‌ వినియోగంతో దాద్రనగర్‌ హవేలీ తొలి స్థానంలో ఉండగా, 5,473 యూనిట్ల విద్యుత్‌ వినియోగంతో డామన్‌ డయ్యూ రెండో స్థానం, 2,031 యూనిట్ల వినియోగంతో పుదుచ్చేరి ఏడో స్థానంలో ఉంది.

వ్యవసాయ విద్యుత్‌లో అగ్రస్థానం

రాష్ట్రాల్లో వివిధ కేటగిరీల వారీగా తలసరి విద్యుత్‌ వినియోగాన్ని పరిశీలిస్తే... 592.24 యూనిట్ల తలసరి వ్యవసాయ విద్యుత్‌ వినియోగంతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. గృహ కేటగిరీలో 813.94 యూనిట్ల తలసరి వినియోగంతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 340.62 యూనిట్లతో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. వాణిజ్య కేటగిరీలో 273.11 వినియోగంతో గోవా అగ్రస్థానంలో, 128.81 యూనిట్ల వినియోగంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. హెచ్‌టీ కేటగిరీలో పారిశ్రామిక విద్యుత్‌ వినియోగంలో 1,163.99 యూనిట్ల వినియోగంతో గోవా ప్రథమ స్థానంలో ఉండగా, తెలంగాణ 299.19 యూనిట్ల వినియోగంతో పదో స్థానంలో ఉంది.

Updated Date - 2023-02-20T02:57:53+05:30 IST