Ramoji Rao : నిధులు మళ్లించారా?

ABN , First Publish Date - 2023-04-04T02:57:00+05:30 IST

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో ఆ సంస్థ చైర్మన్‌ రామోజీరావును ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ డబ్బులు చీటీ పాడుకున్నాక ఆ మొత్తం వినియోగదారుడికి ఇవ్వకుండా తమ సంస్థల్లోనే డిపాజిట్‌ చేయించారనే అభియోగాలపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

Ramoji Rao : నిధులు మళ్లించారా?

మార్గదర్శి కేసులో రామోజీరావును ప్రశ్నించిన ఏపీ సీఐడీ

మా సంస్థపై ఇప్పటి వరకూ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు

లక్షల మంది డిపాజిటర్ల నమ్మకం మేం చూరగొన్నాం

తప్పులకు ఆస్కారమివ్వం.. ‘మార్గదర్శి’ చైర్మన్‌ స్పష్టీకరణ

హైదరాబాద్‌లో విచారణ.. ఎల్లుండి శైలజాకిరణ్‌ వంతు

రామోజీ విచారణ దృశ్యాలు జగన్‌ మీడియాలో ప్రసారం

అనుకూల చానళ్లు, సోషల్‌ మీడియాలోనూ ప్రత్యక్షం!

హైదరాబాద్‌/అమరావతి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో ఆ సంస్థ చైర్మన్‌ రామోజీరావును ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ డబ్బులు చీటీ పాడుకున్నాక ఆ మొత్తం వినియోగదారుడికి ఇవ్వకుండా తమ సంస్థల్లోనే డిపాజిట్‌ చేయించారనే అభియోగాలపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద రామోజీరావుతోపాటు ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌కు ఏపీ సీఐడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు అనుకూలంగా ఉన్న నాలుగు తేదీలు చెప్పాలని వాటిలో పేర్కొనగా ఏప్రిల్‌ 3న తాను అందుబాటులో ఉంటానని రామోజీరావు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐడీ ఎస్పీ అమిత్‌ బర్దార్‌, లీగల్‌ అడ్వైజర్‌తోపాటు ఇతర అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, మహిళా అధికారులు సహా సుమారు 20 మంది బృందం ఆరు కార్లలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 36లోని రామోజీరావు నివాసానికి సోమవారం ఉదయమే చేరుకుని.. సాయంత్రం వరకు ప్రశ్నించింది.

9cid.jpg

నలుగురు కెమెరామెన్‌తో మొత్తం విచారణను రికార్డు చేసింది. అనారోగ్య సమస్యలతో బాదపడుతున్న రామోజీరావును వైద్యుల పర్యవేక్షణలో అధికారులు విచారించారు. ‘చిట్‌ఫండ్స్‌ చట్టానికి విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యుచువల్‌ ఫండ్స్‌, షేర్‌ మార్కెట్లోకి మళ్లించడంపై వివరిస్తారా’ అని ఆయన్ను అడిగారు. మార్గదర్శిపై ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని, లక్షల మంది చందాదారులు, డిపాజిటర్ల నమ్మకం చూరగొన్న సంస్థలో ఎలాంటి తప్పులకు తాము ఆస్కారం ఇవ్వబోమని రామోజీరావు స్పష్టం చేసినట్లు తెలిసింది. గతంలో తమ సంస్థపై ఆరోపణలు వచ్చినప్పుడు సైతం డిపాజిటర్లు ఎక్కడా రూపాయి నష్టపోలేదని, ఇప్పుడూ వారి సొమ్ము కన్నా ఎక్కువ ఆస్తి తమ వద్ద ఉందని బదులిచ్చినట్లు సమాచారం.

చందాదారుల అనుమతితో సంతకం తీసుకున్న తర్వాతే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేశామని, ఎక్కడా ఏదీ దాచుకోలేదని వివరించినట్లు తెలిసింది. సోమవారం రామోజీరావును మాత్రమే విచారించామని, సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ను గురువారం (6న) విచారిస్తామని సీఐడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మార్గదర్శి సంస్థకు చెందిన నలుగురు మేనేజర్లు, ఒక ఆడిటర్‌ను ఏపీ సీఐడీ ఇప్పటికే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. విచారణ సందర్భంగా సీఐడీ అధికారులు మాత్రమే అక్కడ ఉన్నప్పటికీ.. అనారోగ్యంతో ఉన్న రామోజీరావు బెడ్‌పై పడుకునే విచారణలో పాల్గొన్న దృశ్యాలు సీఎం జగన్‌ మీడియాలో ప్రసారమవడం గమనార్హం. ఆ తర్వాత జగన్‌ అనుకూల చానళ్లలో, సోషల్‌ మీడియాలోనూ అవి ప్రత్యక్షమయ్యాయి.

Updated Date - 2023-04-04T03:45:26+05:30 IST