మెకానికల్‌లో ‘కృత్రిమ మేధ’

ABN , First Publish Date - 2023-04-24T02:55:53+05:30 IST

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించిన విద్యార్థులకు మార్కెట్‌లో సరైన ఉద్యోగావకాశాల్లేవు. సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారి పరిస్థితీ అంతే.

మెకానికల్‌లో ‘కృత్రిమ మేధ’

సివిల్‌లో కంప్యూటర్‌ సైన్స్‌

ఇంజనీరింగ్‌ కోర్సుల్లో మార్పులు.. అదనపు సబ్జెక్టుకు అవకాశం

20 క్రెడిట్స్‌తో కోర్సు ఖరారు.. ఈ ఏడాది నుంచే అమలు

ఇంజనీరింగ్‌ మధ్యలో మానేసిన వారు మళ్లీ చదువుకోవచ్చు

8ఏళ్లలో పూర్తిచేసేలా కోర్సు..‘సోషల్‌సైన్స్‌ పీజీ’ కూడా చేయొచ్చు!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించిన విద్యార్థులకు మార్కెట్‌లో సరైన ఉద్యోగావకాశాల్లేవు. సివిల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారి పరిస్థితీ అంతే. కష్టపడి ఇంజనీరింగ్‌ పట్టాలు సాధించినా.. మార్కెట్‌లో అవకాశాలు అంతంతమాత్రమే! ఇలాంటి కోర్సు లు చేసిన వారు బయట మళ్లీ కంప్యూటర్‌ కోర్సులు నేర్చుకొని ఉద్యోగాల కోసం ప్రయత్నించడం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఇంజనీరింగ్‌ సిలబ్‌సలో మార్పులు చేర్పులు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇకపై మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులు అదనంగా కంప్యూటర్‌ సైన్స్‌, కృత్రిమ మేధ (ఏఐ) లాంటి సబ్జెక్టులూ చదువుకోవచ్చు. ఇందుకు సంబంధించిన కోర్సు డిజైన్‌ను ఖరారు చేశారు. ఈ ఏడాది నుంచి ఈ విధానాన్ని విస్తృతంగా అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే ఇంజనీరింగ్‌ కోర్సును మధ్యలో మానేసిన వారికి మళ్లీ చదువుకొనే అవకాశం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తును జేఎన్‌టీయూ అధికారులు పూర్తి చేశారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా సిలబ్‌సలో మార్పులు చేశారు. రాష్ట్రంలో త్వరలోనే ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో ఏయే కోర్సులు అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని అధికారులు ముందుగానే ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఇంజనీరింగ్‌ కోర్సుల నిర్వహణలో పలు మార్పులను తీసుకొచ్చారు. ప్రధానంగా ఇంజనీరింగ్‌ కోర్సు ముగిసే నాటికి ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు లభించే విధంగా సిలబ్‌సను రూపొందించారు.

సెమిస్టర్‌కు 5 క్రెడిట్స్‌..

మెకానికల్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసే విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌కు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఈ కోర్సుల్లో చేరేవారు లేక, కొన్ని కాలేజీలు వాటిని ఎత్తేసిన ఘటనలూ ఉన్నాయి. మెకానికల్‌, సివిల్‌ కోర్సులు చేసిన వారు బయటకు వెళ్లిన తర్వాత కంప్యూటర్‌ బేస్డ్‌ కోర్సులుంటేనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మెకానికల్‌, సివిల్‌ వంటి కోర్సుల్లో చేరే విద్యార్థులకు కంప్యూటర్‌ సైన్స్‌లో ఒక సబ్జెక్టును చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధానంలో భాగంగా మెకానికల్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసే వారికి ఆయా సబ్జెక్టులను మేజర్‌గా పరిగణిస్తారు. వీటికి అదనంగా చదువుకునే కంప్యూటర్‌/ఏఐ వంటి సబ్జెక్టును మైనర్‌గా భావిస్తారు. అదనంగా చదువుకునేందుకు ఏదో ఒక్క సబ్జెక్టునే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్టులో భాగంగా మొత్తం 20 క్రెడిట్స్‌ కేటాయించనున్నారు. ప్రతి సెమిస్టర్‌కు 5 క్రెడిట్స్‌ను కేటాయిస్తారు. ఇలా కోర్సులో భాగంగా మొత్తం నాలుగు సెమిస్టర్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. అదనపు సబ్జెక్టును సర్టిఫికెట్లలో కూడా పేర్కొంటారు. దీంతో ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయని అంచనా వేస్తున్నారు

ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు!

ఇంజనీరింగ్‌ కోర్సు మధ్యలో మానేసిన విద్యార్థులు మళ్లీ చేరడానికి వీలుగా మల్టిపుల్‌ ఎగ్జిట్‌ విధానాన్ని కూడా అమలు పర్చాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్‌ విద్యను 8 ఏళ్లలో పూర్తి చేసుకునే విధంగా దీన్ని రూపొందించారు. ఇక ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో బోధన ప్రమాణాలను పెంచడానికి వీలుగా కొన్ని కఠినమైన చర్యల్ని తీసుకుంటున్నారు.

సోషల్‌సైన్స్‌లోనూ పీజీ!

ఇకపై ఇంజనీరింగ్‌ విద్యను పూర్తి చేసే విద్యార్థులు సోషల్‌సైన్స్‌ సబ్జెక్టుల్లో పీజీ కోర్సుల్లో చేరవచ్చు. పొలిటికల్‌ సైన్స్‌, చరిత్ర, పబ్లిక్‌ అడ్మిస్ట్రేషన్‌, కామర్స్‌, ఇంగ్లిషు, తెలుగు వంటి పీజీ కోర్సుల్లో ఇంజనీరింగ్‌ పట్టభద్రులు చేరే విధంగా నిబంధనలను మార్చారు. ఈ నిర్ణయాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 6 వర్సిటీల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు పీజీలో ఏదైనా కోర్సులో చేరాలంటే సంబంధిత సబ్జెక్టును డిగ్రీలో తప్పనిసరిగా చదివి ఉండాలని, ఆయా సబ్జెక్టులో 40ు మార్కులను సాధించాల్సి ఉండాలి. కానీ, తాజా నిర్ణయంతో ఏ డిగ్రీ కోర్సును పూర్తిచేసినా, కొన్ని పీజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం కల్పించారు.

Updated Date - 2023-04-24T02:55:58+05:30 IST