ఫొటో షేర్‌ చేస్తే పేపర్‌ లీక్‌ చేసినట్లా?

ABN , First Publish Date - 2023-04-07T02:29:39+05:30 IST

వాట్సా ప్‌లో వచ్చిన ఫొటోను షేర్‌ చేస్తే అది పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ చేసినట్లు ఎలా అవుతుంది?

ఫొటో షేర్‌ చేస్తే పేపర్‌ లీక్‌ చేసినట్లా?

పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న సమాచారాన్ని పంపితే నేరమా?

రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రత్యేక ఆరోపణలు ఏమీ లేవు కదా?

ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు.. వివరణకు నోటీసులు

బండి సంజయే కుట్రదారుడు.. అడ్వొకేట్‌ జనరల్‌ వాదన

క్వాష్‌ పిటిషన్‌పై తదుపరి విచారణ సోమవారానికి వాయిదా

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): వాట్సా ప్‌లో వచ్చిన ఫొటోను షేర్‌ చేస్తే అది పదో తరగతి ప్రశ్నపత్రం లీక్‌ చేసినట్లు ఎలా అవుతుంది? పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న సమాచారాన్ని ఇతరులకు పంపితే నేరం అవుతుందా? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో హనుమకొండ కోర్టు తనకు రిమాండ్‌ విధించడాన్ని కొట్టేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ఏకసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎన్‌.రాంచందర్‌రావు వాదనలు వినిపించారు. సీఆర్పీసీ నిబంధనలను పాటించకుండా అర్ధరాత్రి సంజయ్‌ను అరెస్ట్‌ చేశారని.. 41ఏ నోటీసు కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారని తెలిపారు. ప్రభుత్వం కుట్రపూరితంగా సంజయ్‌ను అరెస్ట్‌ చేసిందన్నారు. కరీంనగర్‌ నుంచి హనుమకొండ మధ్య దూరం 60 కిలోమీటర్లు ఉండగా దాదాపు 300 కిలోమీటర్లు తిప్పారని ఆరోపించారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఏ ఆరోపణలూ లేవన్నారు. ఈ దశలో ఽధర్మాసనం జోక్యం చేసుకుంటూ బెయిల్‌ పిటిషన్‌ వేయకుండా క్వాష్‌ పిటిషన్‌ ఎందుకు వేశారని ప్రశ్నించింది. రాంచందర్‌రావు స్పందిస్తూ.. సీఆర్పీసీ 482 కింద దాఖలు చేసే క్వాష్‌ పిటిషన్‌లో హైకోర్టుకు విస్తృత అధికారాలు ఉన్నాయని తెలిపారు. ‘అర్ణబ్‌ గోస్వామి’ కేసులో క్వాష్‌ పిటిషన్‌లోనే బెయిల్‌ ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. దిగువ కోర్టు యాంత్రికంగా ఇచ్చిన రిమాండ్‌ ఆదేశాలను కొట్టేయాలని కోరారు. సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏమిటి? అని ధర్మాసనం అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ఈ కేసులో బండి సంజయ్‌ కుట్రదారుడని.. ఒక మైనర్‌తో పేపర్‌ లీక్‌ చేయించారని ఏజీ తెలిపారు. పేపర్‌ లీక్‌ చేసి ప్రభుత్వ పరువు తీయాలని కుట్ర పన్నారన్నారు. సంజయే ప్రధాన కుట్రదారుడని.. పార్లమెంట్‌ సభ్యుడై ఉండి పేపర్‌ లీకేజీకి పాల్పడ్డారని తెలిపారు. లీకైన పేపర్‌ను ఇతరులకు షేర్‌ చేశారని ఆరోపించారు. జోక్యం చేసుకున్న ధర్మాసనం.. తనకు వచ్చిన సమాచారాన్ని ఇతరులకు షేర్‌ చేస్తే అది పేపర్‌ లీక్‌ చేసినట్లవుతుందా? పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్నదాన్నే షేర్‌ చేశారు కదా? అని ప్రశ్నించింది. ‘ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగితే ప్రతిపక్ష నాయకులు దాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటారు. ఇది సర్వసాధారణంగా జరిగేదే . రిమాండ్‌ రిపోర్ట్‌లో పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ప్రత్యేక ఆరోపణలు లేవు కదా?’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏజీ స్పందిస్తూ.. నిందితుడు లీకైన పేపర్‌ తనకు చేరిన తర్వాత ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి, కమలాపూర్‌ జడ్పీహెచ్‌ఎ్‌స హెడ్‌ మాస్టర్‌కు నోటీసులు జారీచేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దిగువ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చని.. అక్కడ తిరస్కరిస్తే హైకోర్టులో హౌస్‌ మోషన్‌ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌లో నోటీసులు..

సంజయ్‌ని అక్రమంగా అరెస్ట్‌ చేశారని.. ఆయనను కోర్టులో హాజరుపర్చడంతోపాటు పోలీసు కస్టడీ నుంచి విడుదల చేయాలని బీజేపీ నేత సురేందర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది ముజీబ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. సంజయ్‌కి జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించినందున ఈ పిటిషన్‌కు కాలం చెల్లిపోయిందన్నారు. పిటిషనర్‌ తరఫున ఎల్‌.రవిచందర్‌ వాదనలు వినిపిస్తూ.. రిమాండ్‌ విధించినా హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌కు కాలం చెల్లిపోదన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

Updated Date - 2023-04-07T02:29:39+05:30 IST