GHMC Toilets: లేని టాయిలెట్లకు బిల్లులు

ABN , First Publish Date - 2023-05-11T03:30:31+05:30 IST

కనిపించని పబ్లిక్‌ టాయిలెట్లకు బిల్లులు, వినియోగించని మరుగుదొడ్లకు నిర్వహణ వ్యయం చెల్లించడం జీహెచ్‌ఎంసీకే చెల్లింది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌) నగరంగా హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నం విలువ రూ.82 కోట్లు. అయినా ఇప్పటికీ రోడ్ల పక్కనే మల, మూత్ర విసర్జన జరుగుతోంది.

GHMC Toilets: లేని టాయిలెట్లకు బిల్లులు

నిర్వహణకు రెండేళ్లలో 25 కోట్లు ఖర్చు.. ఎన్నికల వేళ ప్రచారం కోసం నిర్మాణం

జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.56 కోట్లతో ఏర్పాటు

7 వేలకుపైగా అందుబాటులోకి

ఇప్పుడు ఉన్నది సగంలోపే

పట్టించుకోక అపరిశుభ్రం

హైదరాబాద్‌ సిటీ, మే 10 (ఆంధ్రజ్యోతి): కనిపించని పబ్లిక్‌ టాయిలెట్లకు బిల్లులు, వినియోగించని మరుగుదొడ్లకు నిర్వహణ వ్యయం చెల్లించడం జీహెచ్‌ఎంసీకే చెల్లింది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత(ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌) నగరంగా హైదరాబాద్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు అధికారులు చేసిన ప్రయత్నం విలువ రూ.82 కోట్లు. అయినా ఇప్పటికీ రోడ్ల పక్కనే మల, మూత్ర విసర్జన జరుగుతోంది. వినియోగించుకోలేనంత దుర్భరంగా టాయిలెట్లు ఉండటమే ఇందుకు కారణం. నగరంలో ప్రధాన, అంతర్గత రహదారి అన్న తేడా లేకుండా రోడ్ల పక్కన ఖాళీగా ఉన్న ఫుట్‌పాత్‌లపై టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ.56.56 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్కలు చూపారు. ఆ మేరకు బిల్లులూ చెల్లించారు. గతంలో నిర్వహించిన పరిశీలనలో కాగితాల్లో చూపిన టాయిలెట్లలో సగం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్లు క్షేత్రస్థాయిలో లేవని గుర్తించారు. బల్దియా నిజంగానే ఏర్పాటుచేస్తే.. మరుగుదొడ్లు ఎందుకు మాయమైనట్టు..? అన్నది చర్చనీయాంశంగా మారింది. అక్కడక్కడా ఉన్న టాయిలెట్లూ అపరిశుభ్రంగా ఉన్నాయి. కమోడ్‌లు, నల్లాలు, డోర్లు, ఇతర సామగ్రి చోరీకి గురవడంతో నిరుపయోంగా మారాయి. అయినా వాటి నిర్వహణకు గడిచిన ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలంలో రూ.25 కోట్లు ఖర్చు చేశారు.

సగానికి పైగా మాయం..

ఎన్నికల వేళ నగరంలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన జరిగిందన్న భావన ప్రజలకు కలిగేలా బీఆర్‌ఎస్‌ వ్యూహాత్మక ప్రచారానికి తెరతీస్తుంది. ఇందులో భాగమే ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్ల ఏర్పాటు. హోర్డింగ్‌లపై నిషేధం అమలులో ఉండడంతో అదనపు ప్రచార వేదికల కల్పనపై గతంలో దృష్టి సారించారు. ప్రజాధనంతో ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిలెట్లు నిర్మించి, వాటిపై ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధితో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 2018 అసెంబ్లీ, 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇదే తరహాలో విస్తృత ప్రచారం చేశారు. టాయిలెట్లు ప్రజల కోసం ఏర్పాటు చేశారా..? ప్రచారం కోసమా..? అన్న విమర్శలూ అప్పట్లో వ్యక్తమయ్యాయి. అవేమీ ప్రభుత్వ పెద్దలకు పట్టలేదు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.. జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. దశలవారీగా గ్రేటర్‌ వ్వాప్తంగా 7 వేలకుపైగా సీటింగ్‌ సామర్థ్యంతో.. ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ టాయిట్లు(పీఎ్‌ఫటీ), బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ (బీఓటీ) పద్ధతిలో, ప్రీ కాస్ట్‌తో గర్వ్‌ టాయిలెట్లు, సులభ్‌ కాంప్లెక్స్‌లు నిర్మించారు. అయితే, యేడాది క్రితం అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన పరిశీలనలో నాలుగు వేలలోపు సీటింగ్‌తో మరుగుదొడ్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ యేడాది కాలంలో వాటి సంఖ్య మరింత తగ్గిపోయింది. జోన్లవారీగా మరుగుదొడ్ల ఏర్పాటుకు లక్ష్యాలు నిర్దేశించి గతంలో సమీక్షించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. ఎన్నికల అనంతరం వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.

రూ.కోట్ల ప్రజాధనం వృథా..

హైదరాబాద్‌లో ఉన్న టాయిలెట్లలో 90 శాతం ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌. ఒక్కో పీఎ్‌ఫటీకి రూ.5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఖర్చు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వీటి ఏర్పాటును నచ్చిన సంస్థలకు అప్పగించి ఆర్థిక ప్రయోజనం చేకూర్చారన్న విమర్శలున్నాయి. ప్రాంతాల వారీగా ఐదు నుంచి పది టాయిలెట్లను క్లస్టర్లుగా పరిగణిస్తూ.. నిర్వహణ, క్లీనింగ్‌ బాధ్యతలను ఏజెన్సీలకు అప్పగించారు. ఈ ప్రక్రియంతా జోనల్‌, సర్కిల్‌ కార్యాలయాల స్థాయిలో జరిగింది. అయితే ఎక్కడా పీఎ్‌ఫటీల క్లీనింగ్‌ జరుగుతున్నట్టు కనిపించదు. అయినా నిర్వహణ పేరిట గత ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలంలో రూ.25కోట్లు ఖర్చు చేసినట్టు బల్దియా పేర్కొంది. ఈ నెల 3న జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో.. కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ రజిత అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించింది. బిల్లుల చెల్లింపునకే పరిమితమైన నిర్వహణ ఇప్పటికీ కాగితాల్లో కొనసాగుతుండటం గమనార్హం.

Updated Date - 2023-05-11T03:30:31+05:30 IST