పంటలు ఆగం

ABN , First Publish Date - 2023-03-20T02:17:18+05:30 IST

అకాల వర్షం పచ్చని పంటలను అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులతో చేను, చెలకలను ఆగం చేసింది.

పంటలు ఆగం

చేను, చెలకలను ముంచెత్తిన అకాల వర్షం

నేలకొరిగిన వరి, మక్క.. రాలిన మామిడి

ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో బీభత్సం

పిడుగుపాటుకు 13 దుక్కిటెద్దులు మృతి

రాష్ట్రంలో పలుచోట్ల నేడు, రేపు వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): అకాల వర్షం పచ్చని పంటలను అతలాకుతలం చేసింది. బలమైన ఈదురుగాలులతో చేను, చెలకలను ఆగం చేసింది. వడగళ్లతో విరుచుకుపడి చేతికొచ్చిన పంటను అన్నదాతకు దూరం చేసింది. వాన దెబ్బకు ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోని వేల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మామిడి,మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు రెండు గంటలపాటు గాలివాన బీభత్సం సృష్టించింది. హనుమకొండ జిల్లాలో 946 ఎకరాల్లో వరి, 4,626 ఎకరాల్లో మొక్కజొన్న నేలవాలింది. 112 ఎకరాల్లో కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. జనగామ జిల్లాలో 67 గ్రామాల్లో 4,338 ఎకరాల్లో వరి, 1,628ఎకరాల్లో మొక్కజొన్న, 100 ఎకరాల్లో మిర్చి, 50 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. వరంగల్‌ జిల్లాలోని 13 మండలాల్లో 48,101 ఎకరాల్లో మొక్కజొన్న, 6 మండలాల్లో 9,450 ఎకరాల్లో వరి, 249 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లింది.

మహబూబాబాద్‌ జిల్లాలో 2,863 ఎకరాల్లో మామిడి, 3,218 ఎకరాల్లో కూరగాయలు, 9,690 ఎకరాల్లో మొక్కజొన్న, 4,990 ఎకరాల్లో వరికి నష్టం వాటిల్లింది. కొత్తగూడ మండలం బత్తులపల్లిలో వడగళ్లు పడి ఐదు గొర్రెలు చనిపోయాయి. మక్క చేనుకు కాపలా వెళ్లిన చిన్నఎల్లాపురం గ్రామానికి చెందిన ధరంసోత్‌ శంకర్‌(40) చెట్టు విరిగి మీద పడి చనిపోయాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామంలో కోళ్లఫాంపై పిడుగు పడడంతో 1,500 కోళ్లు మృత్యువాతపడ్డాయి. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని మూడు గ్రామాల్లో పిడుగుపాటుకు 13 దుక్కిటెద్దులు మృతి చెందాయి.

నేడు, రేపు వర్షాలు

రాష్ట్రంలో నేడు, రేపు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకు ఉత్తర కర్ణాటక, మరాఠ్వాడా మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొంది. రాబోయే 48 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల పరిధిలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Updated Date - 2023-03-20T02:17:18+05:30 IST