CM KCR: దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2023-01-14T11:09:18+05:30 IST

తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR: దేశ, రాష్ట్ర  రైతాంగానికి, ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు

హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న విప్లవాత్మక ప్రగతి అందించే స్ఫూర్తితో, యావత్ దేశ రైతాంగానికి వ్యవసాయం పండుగైన నాడే.. భారత దేశానికి సంపూర్ణ క్రాంతి చేకూరుతుందని సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పంట పొలాల నుంచి ధాన్యపు రాశులు ఇండ్లకు చేరుకున్న శుభ సందర్భంలో రైతన్న జరుపుకునే సంబురమే సంక్రాంతి పండుగని, నమ్ముకున్న భూ తల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగని వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసే దిశగా లక్షలాది కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటి వరకు రూ. 2,16,000 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని సీఎం తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక రైతు సంక్షేమ వ్యవసాయరంగ అభివృద్ధి కార్యాచరణతో నాడు రాష్ట్ర ఆవిర్భావం నాటికి 1 కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే ఉన్న సాగు విస్తీర్ణం, నేడు 2 కోట్ల 4 లక్షల ఎకరాలకు పెరిగిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇది దేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామని వ్యాఖ్యానించారు. ప్రజలంతా మకర సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రతీ ఇల్లు సిరిసంపదలతో తులతూగాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.

Updated Date - 2023-01-14T11:09:21+05:30 IST