ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటులో వివాదం
ABN , First Publish Date - 2023-01-17T00:38:32+05:30 IST
మోతీనగర్ చౌరస్తా సమీపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది.
అల్లాపూర్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): మోతీనగర్ చౌరస్తా సమీపంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం నెలకొంది. జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, పోలీసులు విగ్రహాన్ని తరలించారు. మోతీనగర్ చౌరస్తా సమీపంలోని ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని బాలాజీ స్వర్ణపురి కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చక్రపాణితోపాటు మరికొందరు ప్రయత్నించారు. గతంలో అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు అడ్డుకోవడంతో విగ్రహ ఏర్పాటు ప్రయత్నం ఆగిపోయింది. చక్రపాణి, మరికొందరితో కలిసి ఈ నెల 14 అర్ధరాత్రి జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని మోతీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు విగ్రహాన్ని అక్కడినుంచి తరలించారు. అయితే, శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. మోతీనగర్ పరిసర ప్రాంతాలైన కళ్యాణ్ నగర్, బాలాజీ స్వర్ణపురి కాలనీ, రాజీవ్‌నగర్ కాలనీలలో వందల సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. కొన్నేళ్లుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన అభిమానులు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసిన కార్యదర్శిపై జీహెచ్‌ఎంసీ అధికారుల ఫిర్యాదుతో ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు, పికెటింగ్ ఏర్పాటు చేశారు.