ఆ బక్కచిక్కిన గొర్లు మాకొద్దు..!

ABN , First Publish Date - 2023-06-10T04:50:26+05:30 IST

ఆంధ్రప్రదేశ అంతా తిప్పి బక్కచిక్కిన, కుంటి, గుడ్డి గొర్రెలు అంట గట్టారని.. వాటిని తీసుకొని తమ డీడీ డబ్బులు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ నిర్మల్‌ జిల్లాలో గొల్లకురుమలు నిరసనకు దిగారు.

ఆ బక్కచిక్కిన గొర్లు మాకొద్దు..!

నిర్మల్‌ జిల్లాలో ‘దశాబ్ది ఉత్సవాల్లో’ గొల్లకురుమల నిరసన

జిల్లా పశువైద్యాధికారితో

సుర్జాపూర్‌ గ్రామస్థుల వాగ్వాదం

ఖానాపూర్‌/ఆదిలాబాద్‌, జూన్‌ 9: ఆంధ్రప్రదేశ అంతా తిప్పి బక్కచిక్కిన, కుంటి, గుడ్డి గొర్రెలు అంట గట్టారని.. వాటిని తీసుకొని తమ డీడీ డబ్బులు ఇప్పించాలని డిమాండ్‌ చేస్తూ నిర్మల్‌ జిల్లాలో గొల్లకురుమలు నిరసనకు దిగారు. జిల్లాలోని సుర్జాపూర్‌ గ్రామ గొల్లకురుమలు శుక్రవారం ఖానాపూర్‌లోని జేకే ఫంక్షన హాల్‌లో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఆందోళన చేపట్టారు. మండల పశువైద్యాధికారి దీప్తితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సుర్జాపూర్‌కు 17 యూనిట్లు మంజూరవవ్వగా తామంతా డీడీలు చెల్లించామన్నారు. తర్వాత కేవలం 12మందికి మాత్రమే గొర్రెల యూనిట్లు మం జూరు చేశారన్నారు. గొర్రెల కోసం ఏపీలోని గుంటూరుకు రావాలని అధికారులు సూచించడంతో తామం తా 2 వాహనాల్లో అక్కడికి వెళ్లామన్నారు. గుంటూరు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి 200 కి.మీ. దూరంలో ఉన్న మాచర్లకు, అక్కడికెళ్లాక కడపకు, అటు బయలుదేరాక నెల్లూరుకు రమన్నారని, అక్కడి నుంచి చివరకు మాచర్లకే రప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్లకు వచ్చాక తమకు బక్క చిక్కిన, కుంటి, గుడ్డి, ఇతరత్రా అనారోగ్యంతో ఉన్న గొర్రెల మందలను చూపించారన్నారు. వేలాది కిలోమీటర్ల దూరం రప్పించి ఇబ్బందుల పాలు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమకు ఇచ్చిన గొర్రె పిల్లలు తీసుకొని.. తమ డబ్బు ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఆందోళన

ఇటు ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్వహించిన సంక్షేమ సంబరాలకు నిరసన సెగ తగిలింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతున్న క్రమంలో నాయీబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. నాయీబ్రాహ్మణ వృత్తిని సర్కార్‌ కాపాడాలని, కార్పొరేట్‌ సెలూన్లను రద్దు చేయాలన్నారు. వేరే వర్గాల వారు తమ వృత్తిలోకి రాకుండా ప్రత్యేక చట్టాన్ని చేయాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో ఓ వర్గానికి చెందిన వారు కార్పొరేట్‌ స్థాయిలో సెలూన్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. నాయీబ్రాహ్మణ సేవా సంఘం నేత లు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత తలెత్తగా.. పోలీసులు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.

Updated Date - 2023-06-10T04:50:26+05:30 IST