DPH Gadala Srinivasa Rao: గడల రాజభక్తి!

ABN , First Publish Date - 2023-02-17T02:09:58+05:30 IST

రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు (డీపీహెచ్‌) గడల శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలంటూ అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌వోల)కు గురువారం ఆయన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

DPH Gadala Srinivasa Rao: గడల రాజభక్తి!

సీఎం కేసీఆర్‌ పుట్టినరోజున మొక్కలు నాటాలని..

డీఎంహెచ్‌వోలకు డీపీహెచ్‌ అధికారిక ఉత్తర్వులు

ఆస్పత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీకి ఆదేశాలు

మరోసారి వివాదంలో ప్రజారోగ్య సంచాలకుడు

హైదరాబాద్‌లో భారీగా ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు, కటౌట్లు

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా ఏర్పాటు

నేడు సీఎం జన్మదినం.. ప్రారంభమైన వేడుకలు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు (డీపీహెచ్‌) గడల శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లలో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలంటూ అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌వోల)కు గురువారం ఆయన అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒక ఉన్నత స్థాయి అధికారి ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడమేంటన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గడల తీరుపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ సీఎం కేసీఆర్‌కు శ్రీనివాసరావు పాదాభివందనం చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్న శ్రీనివాసరావు.. కేసీఆర్‌ను ప్రసన్నం చేసుకోవడానికే రాజభక్తి ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా నియంత్రణలోకి వచ్చిందంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌ జన్మదినం నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు సహా ఇతర నేతలు హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అయితే వీటి ఏర్పాటుపై ఓవైపు నిషేధం ఉండగా, మరోవైపు ఉపాధ్యాయ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్‌ అమలులో ఉంది. అయినా అధికార పార్టీ నేతలు భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆరే స్వయంగా.. ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయించారు. అయినా ఇటు అధికార పక్షంతోపాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ నిషేధాన్ని లెక్క చేయకుండా వీటిని ఏర్పాటు చేస్తూనే ఉన్నాయి.

కేసీఆర్‌ జన్మదిన వేడుకలు షురూ..

శుక్రవారం సీఎం కేసీఆర్‌ పుట్టినరోజును పురస్కరించుకొని హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని పలు చోట్ల గురువారం సాయంత్రం నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు.. కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేయడంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృతంగా ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో చేపట్టిన వాలీబాల్‌ పోటీల ముగింపుతోపాటు సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్‌ కట్‌చేసి స్టేడియంలో సందడి చేశారు. కాగా, మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి మార్కెట్‌ యార్డులో రైతు బాంధవుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు ఉన్న సీఎం కేసీఆర్‌ చిత్రపటాన్ని వేరుశనగ, ఉల్వలు, ఉప్పు, రంగులతో రూపొందించారు.

కాగా శుక్రవారం పీవీ మార్గ్‌లోని సంజీవయ్య పార్కు పక్కన జరగనున్నాయి. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఈ వేడుకలకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్‌లోని థ్రిల్‌ సిటీలో, ఉదయం 10.30కు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో వేడుకలు నిర్వహించనున్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల వేడుకలు జరపనున్నారు.

Updated Date - 2023-02-17T02:09:59+05:30 IST