Durgam Cheruvu Resort: దుర్గం చెర

ABN , First Publish Date - 2023-03-07T02:52:16+05:30 IST

అది.. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ పరిధిలో ఆహ్లాదకరమైన దుర్గం చెరువు వెంట ఉన్న పర్యాటక స్థలం. పెద్ద చెట్లు, కొండరాళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది రిసార్టు పార్కుగా మార్చడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదం కలిగించిన ప్రదేశం.

Durgam Cheruvu Resort: దుర్గం చెర

ప్రైవేటు కోరల్లో దుర్గం చెరువు రిసార్ట్‌ పార్కు!

4 ఎకరాల పర్యాటక స్థలం అత్తెసరు ధరకు లీజుకు

రెస్టారెంట్‌, ఫుడ్‌ కోర్టుల ఏర్పాటు కోసం ఓ బడాబాబుకు

ఓ మంత్రి ఆదేశంతో గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం

పత్రికా ప్రకటన లేకుండా గోప్యంగా టెండర్‌ ప్రక్రియ

నిబంధనలకు విరుద్ధంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు

శాశ్వత నిర్మాణాలు!.. స్థలం సొంతం చేసుకునేందుకే

చెట్లను నరికేసి కనిపించకుండా రాత్రిపూట కాల్చివేత

రిక్రియేషన్‌ జోన్‌లో నిర్మాణాలకు బ్లూ రెయిలింగ్‌ పనులు

చోద్యం చూస్తున్న గ్రేటర్‌, హెచ్‌ఎండీఏ, అటవీశాఖ

బార్‌తో చెరువు కలుషితమవుతుందన్న ఆందోళన

(ఆంధ్రజ్యోతి నిఘా విభాగం): అది.. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ పరిధిలో ఆహ్లాదకరమైన దుర్గం చెరువు వెంట ఉన్న పర్యాటక స్థలం. పెద్ద చెట్లు, కొండరాళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది రిసార్టు పార్కుగా మార్చడం ద్వారా పర్యాటకులకు ఆహ్లాదం కలిగించిన ప్రదేశం. గజం భూమి కూడా అత్యంత విలువైన జూబ్లీహిల్స్‌లోని ప్రాంతం. ఇలాంటి స్థలాన్ని పర్యాటక శాఖ అధికారులు.. ఓ ప్రైవేటు బడా సంస్థకు అత్తెసరు ధరకు లీజుకు ఇచ్చేశారు. రిసార్టు పార్కును మూసేసి మరీ.. రెస్టారెంట్‌, ఫుడ్‌ కోర్టుల ఏర్పాటు కోసం అప్పనంగా కట్టబెట్టేశారు. పైగా పార్కును అప్పగించే క్రమంలో టెండర్‌ నిబంధనలేవీ పాటించలేదు. 2020లో కొవిడ్‌ సమయాన్ని ఆసరాగా చేసుకొని చక్రం తిప్పారు. పత్రికల్లో ప్రకటనలేవీ ఇవ్వకుండా ఆన్‌లైన్‌లో నేరుగా టెండర్‌ పెట్టారు. ‘సంబంధిత’ సంస్థలకు మాత్రమే సమాచారం అందించి.. అవి మాత్రమే టెండర్‌లో పాల్గొనేలా చేసి ఏకంగా నాలుగు ఎకరాల స్థలాన్ని అప్పగించారు.

FG.jpg

మొత్తం వ్యవహారం వెనుక ఓ మంత్రి ప్రోద్బలం ఉందన్న ఆరోపణలున్నాయి. ఇదంతా ఒక ఎత్తయితే.. స్థలాన్ని లీజుకు తీసుకున్న సంస్థ అందులో శాశ్వత నిర్మాణాలు చేపట్టి తమ సొంతం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. సాధారణంగా.. మాదాపూర్‌లో మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉండే ఓ మాల్‌లో చదరపు అడుగు లీజు ధర రూ.170 వరకు ఉంటుంది. ఇందులో 1200 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంటే నెలకు రూ.2.04 లక్షలు అవుతుంది. అదే జూబ్లీహిల్స్‌లో ఖాళీ స్థలమైతే.. చదరపు గజం రూ.300 నుంచి 400 వరకులీజుకు ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో ఫుడ్‌కోర్టుకు స్థలాన్ని అద్దెకు ఇస్తే చదరపు అడుగుకు రూ.250 నుంచి రూ.320 వరకు చెల్లిస్తున్నారు. కానీ, ఎంతో ఖరీదైన జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ ప్రాంతంలో నాలుగు ఎకరాల పార్కును రూ.15 లక్షలకే ప్రైవేటు సంస్థకు లీజుకు ఇవ్వడం గమనార్హం. దుర్గం చెరువు ఎగువన ఉన్న జూబ్లీహిల్స్‌లోని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ వెనకాల రిసార్టు పార్కును ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టింది టూరిజం కార్పొరేషన్‌ సంస్థ.

2resort-park-2.jpg

ఆహ్లాదకర రిసార్ట్‌ పార్కు మూసివేత..

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గం పాయిగా రెవెన్యూ గ్రామం పరిధిలోని 6, 7, 8 సర్వే నంబర్లలో టూరిజం శాఖకు కొంత భూమి ఉంది. ఈ సర్వే నంబర్లలోని భూమి మొత్తం హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం రిక్రియేషన్‌ జోన్‌లోనే ఉంది. వాస్తవంగా రిక్రియేషన్‌ జోన్‌లో అసలు శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధన ఉంది. కానీ, టూరిజం శాఖ దీనికి విరుద్ధంగా దుర్గం చెరువు ఎగువన ప్రత్యేకంగా రిసార్ట్‌ పార్కును ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేసింది. సందర్శకులను ఆకట్టుకునేందుకు చెట్లు, కొండరాళ్లతో ఆకర్షణీయంగా పార్కును తీర్చిదిద్దింది. ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేసింది. పెద్ద సంఖ్యలో సందర్శకులు రావడంతో.. పార్కులో ఉన్న ఫుడ్‌ స్టాల్స్‌, టికెట్ల ద్వారా టూరిజం శాఖకు నెలకు రూ.50 లక్షల దాకా ఆదాయం వచ్చేది. అయితే లాక్‌డౌన్‌ సందర్భంలో రిసార్ట్‌ పార్కు అప్పట్లో మూతబడింది. లాక్‌డౌన్‌ ఎత్తేశాక కూడా పార్కును తెరవకుండా శాశ్వతంగా మూసేశారు. ఆపై 4 ఎకరాల్లో ఉన్న ఈ రిసార్ట్‌ పార్కు స్థలాన్ని రెండేళ్ల క్రితం ప్రైవేటు సంస్థకు అప్పగించారు. నెలకు రూ.15 లక్షల చొప్పున ఏడాదికి రూ.1.80 కోట్లకు పదేళ్లపాటు లీజుకు ఇచ్చారు.

2resortr-park.jpg

టెండర్ల ప్రక్రియ పూర్తిగా గోప్యం..

దుర్గం చెరువు పార్కు.. కొవిడ్‌ కంటే ముందు మూతపడడంతో ఇదే అదునుగా ప్రైవేటు సంస్థకు కట్టబెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఉన్నత స్థాయి ఒత్తిళ్లతో టెండర్‌ ప్రక్రియను చేపట్టిన టూరిజం శాఖ అధికారులు.. టెండర్‌ నిబంధనలు మాత్రం పాటించలేదు. కనీసం రెండు పత్రికల్లో టెండర్‌ ప్రకటన ఇవ్వాల్సి ఉన్నా.. నేరుగా ఆన్‌లైన్‌లో టెండర్‌ పెట్టేశారు. సాధారణంగా.. అత్యవసర టెండర్‌ అయితేనే నాలుగైదు రోజుల గడువు ఇవ్వాలి. అదేమీ లేకుండా ముందస్తు సమాచారమిచ్చిన సంస్థలు మాత్రమే పాల్గొనేలా చకచకా పని కానిచ్చేశారు. ముందుగానే నిర్ణయించుకున్న సంస్థకు రిసార్ట్‌ పార్కు దక్కేలా చూశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రి తెరవెనుక ప్రణాళిక రచించినట్లు తెలిసింది. అయితే రెండేళ్ల క్రితమే అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నా.. సదరు కంపెనీ నిర్వాహకులు రిసార్ట్‌ను అందుబాటులోకి తీసుకురాలేదు. టూరిజం శాఖకు అద్దె చెల్లించలేదు. పైగా సదరు సంస్థ మరో సంస్థకు అధిక ధరకు లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ఇందులోనూ సదరు మంత్రి కీలకంగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ సంస్థలో మంత్రి అనుయాయులే డైరెక్టర్లుగా కొనసాగుతున్నట్లు సమాచారం.

రెస్టారెంట్లతో చెరువు కలుషితం..

దుర్గం చెరువు రిసార్ట్‌ పార్కు పక్కనే అర ఎకరం స్థలాన్ని 2003లో ఓ పేరొందిన సంస్థకు లీజుకు ఇవ్వగా, ప్రస్తుతం అక్కడ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. అర ఎకరానికి పైగా ఉన్న స్థలాన్ని నెలకు కేవలం రూ.3 లక్షల చొప్పున లీజుకిచ్చారు. ఏటా లీజు అద్దెపై 6 శాతం పెంచాలనే ఒప్పందంతో 33 ఏళ్లు లీజుకు అప్పగించారు. ఇప్పటివరకు 20 ఏళ్లు గడిచింది. అయితే బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ఏర్పాటు చేసిన ప్రాంతంలో పెద్ద పెద్ద నిర్మాణాలు వచ్చాయి. అందులో నుంచి డ్రెయినేజీ, సీవరేజీ.. దుర్గం చెరువులోకి వెళ్తుండంతో ఇక్కడ బోటింగ్‌ చేస్తున్న పర్యాటకులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఇదే స్థలం పక్కన ఉన్న నాలుగు ఎకరాల రిసార్ట్‌ పార్కు స్థలంలో ఏర్పాటు చేయనున్న రెస్టారెంట్లతో దుర్గం చెరువు మరింత కలుషితమయ్యే ప్రమాదముందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిసార్ట్‌ పార్కును టూరిజం శాఖే నిర్వహించి ఉంటే కార్పొరేషన్‌కు ప్రవేశ టికెట్ల ద్వారానే పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ఇతర ఫుడ్‌ కోర్టుల ద్వారా కూడా అదనపు ఆదాయం వచ్చేదని అంటున్నారు.

సాధారణంగా దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లోనే.. వెయ్యి, రెండు వేల చదరపు గజాల స్థలాన్ని లీజుకు తీసుకుంటే నెలకు తక్కువలో తక్కువ రూ.5 లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే దుర్గం చెరువు సమీపంలో 600 చదరపు గజాల స్థలాన్ని ఓ సంస్థ లీజుకు తీసుకొని చ.గజానికి రూ.260 చొప్పున నెలకు రూ.1.56 లక్షల వరకు చెల్లిస్తోంది. అలాంటిది నాలుగు ఎకరాల స్థలాన్ని నెలకు రూ.15 లక్షలకే లీజుకివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్థలాన్ని దక్కించుకునే ప్రయత్నాలు

10 ఏళ్ల పాటు లీజుకి తీసుకున్న సదరు సంస్థ అందులో శాశ్వతంగా పాగా వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రిక్రియేషన్‌ డెవల్‌పమెంట్‌లో భాగంగా ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లను ప్రీ కాస్ట్‌ (నట్‌, బోల్టులతో నిర్మాణ) పద్ధతిన ఏర్పాటు చేసుకోవాలనే ఒప్పందం ఉండగా.. అందుకు భిన్నంగా పనులు సాగుతున్నాయి. రిక్రియేషన్‌ జోన్‌లో ఉన్న స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు రిసార్ట్‌ పార్కు మొత్తానికి బ్లూ రెయిలింగ్‌ రేకులను చుట్టారు. నిర్మాణ పనులు ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నారు. రిక్రియేషన్‌ జోన్‌లో చేపట్టే నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. అటువంటిదేమీ లేకుండానే నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. అయినా జీహెచ్‌ఎంసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

రిక్రియేషన్‌జోన్‌లో తాత్కాలిక నిర్మాణాలు కాకుండా శాశ్వత నిర్మాణాలు చేపట్టాలంటే జోన్‌ మార్పు కోసం చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌కు (సీఎల్‌యూ) హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేయాలి. ఈ ప్రక్రియను కూడా సదరు సంస్థ చేపట్టలేదు. పైగా రిసార్ట్‌ పార్కులో పెద్ద సంఖ్యలో ఉన్న చెట్లను తొలగిస్తూ రాత్రి సమయంలో తగులబెడుతున్నారు. దీనివల్ల రిసార్ట్‌ పార్కులోని కొండరాళ్లు, చెట్లకు ప్రమాదం పొంచి ఉందని, అవసరమైన స్థలం కోసం నిప్పు పెట్టే అవకాశాలున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ ద్వారా అందమైన కొండరాళ్లు చెదురుతాయని, ఎత్తయిన వృక్షాలకు నేలకూలుతాయని పర్యావరణవేత్తలు అంటున్నారు. సంస్థ నిర్వాహకులు మాత్రం పార్కు పరిసర ప్రాంతం వైపు ఇతరులెవరూ కన్నెత్తి చూడకుండా బౌన్సర్లతో బెదిరింపులకు దిగుతున్నారు.

Updated Date - 2023-03-07T02:55:12+05:30 IST