తల్లి తెలంగాణ విముక్తి కోసం ఏకం కావాలి

ABN , First Publish Date - 2023-01-09T00:46:40+05:30 IST

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సమావేశం మాసాబ్‌ట్యాంక్‌లోని ఖాజా ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించారు.

తల్లి తెలంగాణ విముక్తి కోసం ఏకం కావాలి

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌

కార్వాన్‌, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): బీసీ కుల సంఘాల ఐక్యవేదిక సమావేశం మాసాబ్‌ట్యాంక్‌లోని ఖాజా ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. బీసీ కుల సంఘాల సంక్షేమానికి తాను ఎప్పుడు కృషి చేస్తానని రాజేందర్‌ అన్నారు. బీసీ కుల సంఘాల అభివృద్ధికి చైతన్యం రగిలించేవారు తనకు ఎప్పుడూ మిత్రులేనని, చైతన్యం చచ్చిపోతే వచ్చేది ఉన్మాదం అని ఆయన అన్నారు.

మనం చైతన్యవంతులుగా ఉన్నాం కాబట్టే మనకు గుర్తింపు ఉందని అన్నారు. మొదటిసారిగా మన జాతి వ్యక్తి దేశ ప్రధాని అయ్యాక కేంద్ర క్యాబినెట్‌లో 27 మంది ఓబీసీలు, 12 మంది దళితులు, 8 మంది గిరిజనులు, 5 మంది మైనార్టీలు మంత్రులు అయ్యారని గుర్తు చేశారు. మోదీ నాయకత్వంలో పటిష్ఠమైన పాలన నడుస్తోందని, బీసీలు పాలన చెయ్యలేరు అనేవారికి ఇది చెంపపెట్టు అని ఈటల అన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏ కులం చేత, కుటుంబం చేత పెట్టబడిందో... ఆ కుటుంబం, ఆ కులం మాత్రమే రాజ్యం ఏలుతుందని అన్నారు. తల్లి తెలంగాణ విముక్తి కోసం పార్టీలు, జెండాలు, మతాలు పక్కన పెట్టి ముందుకి రండి... తెలంగాణ వస్తే నేను కాపలా కుక్కలా ఉంటా అన్నవారు అందలమెక్కారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వీకర్‌ సెక్షన్‌ స్టేట్‌, ఈ రాష్ట్రంలో బీ.ఆర్‌.ఎస్‌ ఉన్నంతకాలం ఆ కుటుంబం తప్ప వేరే వారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని ఆయన ఎద్దేవా చేశారు. రాజకీయ పార్టీలు ప్రజలు చల్లగా ఉండాలని కోరుకుంటాయి కానీ, తెలంగాణలో అణచివేత నడుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ రాజకీయాలను డబ్బుమయం చేశారని, ప్రజల్లో ఉన్నవాడికంటే డబ్బు ఉన్నవాడికే సీట్లు ఇస్తున్నారని ఇది ఎక్కడ అన్యాయమని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో ఇది పునరావృతం కాకుండా చూడాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కాటం నరసింహ యాదవ్‌, సిలువ శంకర్‌, సంగెం సూర్యారావు, తుల ఉమా, శెట్టి ప్రదీప్‌ కుమార్‌, గుండ్ల ఆంజనేయులుగౌడ్‌, తూమూరు శ్రీరాములు, సుధాకర్‌ యాదవ్‌, బి. మంగళారపు మహేష్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-09T00:46:45+05:30 IST