కన్నుల పండువగా హనుమాన్ శోభాయాత్ర
ABN , First Publish Date - 2023-04-07T03:14:45+05:30 IST
హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది.
గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు ర్యాలీ
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు
హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. తొలుత గౌలిగూడలోని చారిత్రక రామాలయంలో హనుమంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ వెండి హనుమంతుడి విగ్రహాన్ని ప్రత్యేక పూలతో అలంకరించిన రథంపై పెట్టారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. వేలాది మంది హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబూని జై శ్రీరాం.. జై హనుమాన్ అంటూ బైక్‌లపై ముందుకు కదిలారు. గౌలిగూడ నుంచి ప్రారంభమైన యాత్ర తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే వరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాగా, ర్యాలీలో పాల్గొనేందుకు బయలుదేరిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులనుప్రశ్నించిన రాజాసింగ్.. కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత దారుణంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు.