మహనీయురాలు సావిత్రిబాయి పూలే

ABN , First Publish Date - 2023-01-04T04:36:56+05:30 IST

మహిళల కోసం మొట్టమొదటి పాఠశాల నెలకొల్పి, విద్యా బోధన చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

మహనీయురాలు సావిత్రిబాయి పూలే

పార్లమెంటు ప్రాంగణంలో ఆమె విగ్రహం ఏర్పాటు చేయాలి

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రవీంద్ర భారతిలో ఘనంగా సావిత్రిబాయి జయంతి వేడుకలు

ఆమె స్ఫూర్తితోనే రాష్ట్రంలో 310 గురుకులాలు: మంత్రి గంగుల

రవీంద్రభారతి/హైదరాబాద్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మహిళల కోసం మొట్టమొదటి పాఠశాల నెలకొల్పి, విద్యా బోధన చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం, సావిత్రి బాయిపూలే జయంతి వేడుకల కమిటీ ఆధ్వర్యంలో ఆమె 192వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ సమాజంలో విద్య అవసరాన్ని గుర్తించిన మహానుభావులు పూలే దంపతులని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, మహిళల కోసం పరితపించిన సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఆమె విగ్రహాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు కూడా హాజరై సమాజానికి సావిత్రిబాయి పూలే అందించిన సేవలను వివరించారు. ఈ సందర్భంగా పలువురిని ప్రతిభా పురస్కారాలతో సత్కరించారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని కొనసాగిస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ మహాత్మా పూలే పేరుతో 310 గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూలే స్ఫూర్తితో మహిళల కోసం కొత్తగా రెండు వ్యవసాయ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిందని బీసీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డా.మల్లయ్య బట్టు పేర్కొన్నారు.

మొదటి చదువుల తల్లి

భారతదేశ మొదటి చదవుల తల్లి సావిత్రిబాయి పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివ రావు అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆమె జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో జరిగాయి.

Updated Date - 2023-01-04T04:36:56+05:30 IST