Inter classes: ఇంటర్ తరగతులు జూన్ 1 నుంచి
ABN , First Publish Date - 2023-04-02T02:11:24+05:30 IST
రాష్ట్రంలో ఇంటర్మీడియట్(ఫస్టియర్, సెకండియర్) తరగతులు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శనివారం (ఏప్రిల్ 1) నుంచి మే 31 వరకు అన్ని జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు.
మే 31 దాకా వేసవి సెలవులు
సెలవుల్లో క్లాసులు పెడితే చర్యలు
కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంటర్మీడియట్(ఫస్టియర్, సెకండియర్) తరగతులు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. శనివారం (ఏప్రిల్ 1) నుంచి మే 31 వరకు అన్ని జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు శనివారం విడుదల చేసింది. దాని ప్రకారం జూన్ 1 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుండగా అక్టోబర్ 19-25 తేదీల్లో కళాశాలలకు దసరా సెలవులు ఇస్తారు. నవంబరు 20-25 తేదీల్లో అర్ధ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. అదేవిధంగా 2024 జనవరి 13-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు కాగా జనవరి 22న ప్రిఫైనల్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇక, ఫిబ్రవరి నెల రెండో వారంలో ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి తొలి వారంలో ప్రధాన పరీక్షలు నిర్వహిస్తారు. కాగా, జూన్ 1న కళాశాలల పునః ప్రారంభం అవుతాయని, ఆ లోపు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి నవీన్ మిత్తల్ హెచ్చరించారు. అంతేకాక, తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ షెడ్యూల్ ప్రకారం జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టాలని స్పష్టం చేశారు.