హెచ్‌సీఏ ఎన్నికల బాధ్యత జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావుకు

ABN , First Publish Date - 2023-02-15T03:45:58+05:30 IST

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీని వేసింది.

హెచ్‌సీఏ ఎన్నికల బాధ్యత జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావుకు

ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీం

నలుగురు సభ్యుల కమిటీ రద్దుకు ఆదేశం

అధ్యక్షుడిగా అజర్‌ అధికారాలు రద్దయినట్లే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) ఎన్నికలను నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీని వేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వర్‌రావుకు ఈ కమిటీ బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల నిర్వహణతో పాటు ఇతర వివాదాలను కూడా ఆయనే పరిష్కరిస్తారు. హెచ్‌సీఏ పర్యవేక్షణకు గతంలో జస్టిస్‌ కక్రూ నేతృత్వంలో వేసిన నలుగురు సభ్యుల కమిటీ తాజా కమిటీ ఏర్పాటుతో రద్దవుతుంది. అంతేకాకుండా, ఎన్నికలు జరిగి, కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యే వరకు అన్ని నిర్ణయాలు తీసుకొని, సంతకాలుచేసే అధికారాన్ని జస్టిస్‌ నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టు కట్టబెట్టడంతో ప్రస్తుతం అధ్యక్షుడి హోదాలో హెచ్‌సీఏను నడిపిస్తున్న అజరుద్దీన్‌ పాలన అంతం అయినట్లయింది. త్వరగా హెచ్‌సీఏ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన దరఖాస్తుపై న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.

ఎన్నికల వివాదం ముగింపునకు రావాలని, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని ఈ సందర్భంగా ధర్మాసనం అభిప్రాయ పడింది. కోర్టులే అన్ని క్రీడా సంఘాలను పర్యవేక్షించలేవని స్పష్టం చేసింది. జస్టిస్‌ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ దవే సూచించారు. అందుకు వెంటనే అంగీకరించిన ధర్మాసనం.. ‘‘ఈ వివాద పరిష్కారానికి జస్టిస్‌ నాగేశ్వరరావు సరైన వ్యక్తిగా భావిస్తున్నాం. ఆయన నేతృత్వంలో ఏక సభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నాం’’ అని తెలిపింది. ఆయనకు అవసరమైన సహకారాన్ని అందించాలని, ఖర్చును భరించాలని హెచ్‌సీఏను ఆదేశించింది. అజరుద్దీన్‌ను అధ్యక్షుడిగా కొనసాగించాలని ఆయన తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు స్పందించలేదు. జస్టిస్‌ నాగేశ్వరరావు నియామకంతో అజరుద్దీన్‌ అధికారాలకు తెరపడింది. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. భారత ఒలింపిక్‌ సంఘం నూతన రాజ్యాంగాన్ని తయారు చేయడంతో పాటు తాజా ఎన్నికలు కూడా జస్టిస్‌ నాగేశ్వర్‌రావు పర్యవేక్షణలోనే జరిగాయు.

Updated Date - 2023-02-15T03:47:29+05:30 IST