Komatireddy Rajagopal Reddy: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు?
ABN , First Publish Date - 2023-06-28T03:36:02+05:30 IST
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిని మారిస్తే బండి సంజయ్ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తే ఎలా ఉంటుందనే విషయంపై పార్టీ అధినాయకత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది....
రాజగోపాల్‌తో ముఖ్య నేతలు చర్చిస్తారని ప్రచారం
న్యూఢిల్లీ, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడిని మారిస్తే బండి సంజయ్ స్థానంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమిస్తే ఎలా ఉంటుందనే విషయంపై పార్టీ అధినాయకత్వం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం హోం మంత్రి అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని దేశ రాజధానిలోనే ఉండాలని పార్టీ పెద్దలు కోరడం దీనికి బలాన్ని చేకూర్చుతోంది. ‘మీకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే ఏం చేస్తారు..?’ అని ఒక సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డిని అడిగినట్లు తెలిసింది. రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధ్యక్ష పదవి, ఈటల రాజేందర్‌కు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇస్తే.. ఈ జోడు గుర్రాలు తెలంగాణలో బీజేపీకి జోష్ తేగలవని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. కాగా, దీనిపై ఈ వారాంతంలోపు ప్రధాని మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని.. ఇప్పటికే ఆయన ముందుకు వివిధ నివేదికలు వెళ్లాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అవసరమైతే మోదీ, అమిత్ షా, నడ్డా తదితరులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించే అవకాశాలున్నాయని వారు తెలిపారు.
సంతో్‌షతో బండి సంజయ్ భేటీ..
రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతో్‌షతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రంలో పార్టీ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని సంజయ్‌తో సంతోష్ అన్నట్లు సమాచారం. ప్రధాని మోదీ నిర్ణయంపై సంజయ్ భవిష్యత్ ఆధారపడి ఉందని కూడా ఆయన చెప్పినట్లు తెలిసింది. మంగళవారం రాత్రి సంజయ్ హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.