KTR: మోదీ వచ్చింది రాజకీయానికే..
ABN , First Publish Date - 2023-04-10T02:52:24+05:30 IST
ప్రధాని నరేంద్రమోదీ కేవలం రాజకీయాల కోసమే హైదరాబాద్ వచ్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నా.. మోదీ నోటి నుంచి ఒక్క అభినందన కూడా రాలేదని విమర్శించారు.
తెలంగాణ ఘనతలపై మాట్లాడలేదు
ఇంతలా వృద్ధి చెందిన రాష్ట్రం ఉందా?
ప్రధానిపై ట్విటర్‌లో కేటీఆర్ విమర్శలు
27న తెలంగాణ భవన్‌లో
బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
25న నియోజకవర్గ స్థాయి భేటీ: కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ కేవలం రాజకీయాల కోసమే హైదరాబాద్ వచ్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అంతర్జాతీయంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నా.. మోదీ నోటి నుంచి ఒక్క అభినందన కూడా రాలేదని విమర్శించారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన విమర్శలపై ఆదివారం ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో సమానంగా ఈ తొమ్మిదేళ్లలో అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని దేశంలో చూపించగలరా? అని సవాల్ విసిరారు. దేశంలో ఉత్తమ గ్రామీణాభివృద్ధి నమూనా కలిగి.. వందశాతం ఓడీఎఫ్ ప్లస్ సాధించామని, ఇంటింటికీ మంచినీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. వరి ధాన్యం అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, దేశ జీడీపీ వృద్ధికి త్పోడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని, దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం, అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్, ప్రపంచ స్థాయి వ్యాక్సిన్ హబ్ తెలంగాణ ప్రత్యేకతలు అని పేర్కొన్నారు. రాష్ట్ర యువత కోసం అత్యధిక ఐటీ ఉద్యోగాలను సృష్టిస్తున్నామన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేశామని తెలిపారు.
27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం
బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని 27న తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పార్టీ జెండాను ఎగురవేస్తారని, ఆ తర్వాత ఆయన అధ్యక్షతన చేపట్టే బీఆర్‌ఎస్ సర్వసభ్య సమావేశంలో 300మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పా రు. ఇందులో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, చర్చించడంతోపాటు వాటి ఆమోదించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున వరి కోతలు ఉండడం, ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భారీ సభ/విస్తృత స్థాయి సమావేశాన్ని వాయిదా వేశామన్నారు. అక్టోబరు 10న వరంగల్‌లో బీఆర్‌ఎస్ మహాసభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను విస్తృతంగా జరపాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశాలు నిర్వహించాలన్నారు. పార్టీ నియమించిన ఇన్‌చార్జులు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన చేపట్టే ఈ సమావేశాల నిర్వహణను జిల్లా పార్టీ అధ్యక్షులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
అన్ని గ్రామాల్లో జెండాలు ఎగురవేయాలి..
ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయం 10 గంటల్లోపు పార్టీ జెండాలు ఎగురవేయాలని, ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టే ప్రతినిధులు సభకు చేరుకోవాలని కోరారు. ఆ సభల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సభలకు కనీసం 2500 నుంచి 3000 మంది ప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర సీనియర్ నాయకుల దాకా ఈ సమావేశాలకు హాజరవుతారని కేటీఆర్ వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. శ్రేణులకు అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. మే నెలాఖరు దాకా వీటిని కొనసాగించాలన్నారు.
మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులు
రాష్ట్రంలోని మూడు శాసనసభ నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్ కొత్త ఇన్‌చార్జులను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో.. ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా మర్రి రాజశేఖర్‌రెడ్డి నియమించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లేని గోషామహల్ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నందకిషోర్ వ్యాస్ బిలాల్‌ను, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఎంపీ మాలోతు కవితను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. వీరు ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ మరియు నియోజకవర్గాలకు బాధ్యులుగా కొనసాగుతారని పేర్కొన్నారు.
పేరుకే ప్రారంభోత్సవం.. శంఖుస్థాపనలు: కేకే
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ‘పేరుకు మాత్రమే ప్రారంభోత్సవం.. శంఖుస్థాపనలు.. కేంద్రం నిధులు ఖర్చుపెట్టి.. బీజేపీ ప్రచారం కోసమే మోదీ హైదరాబాద్‌కు వచ్చారు’ అని బీఆర్‌ఎస్ పార్లమెంటరీపార్టీ నేత కె.కేశవరావు ఆరోపించారు. ఎంపీలు సురేశ్‌రెడ్డి, వెంకటే్‌షనేతతో కలిసి ఆదివారం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎయిమ్స్‌లో ఇప్పటికే నిర్మించిన భవనాలకు శంఖుస్థాపనలు చేశారని ఎంపీలు ఎద్దేవాచేశారు. తెలంగాణపై విషం కక్కడం తప్ప.. ఈ ప్రాంత అభివృది కేంద్రం చేసిందేమీ లేదన్నారు. ఇక్కడ అభివృద్ధి జరగలేదని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని మండిపడ్డారు. ఎంపీ సురేశ్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలో మెజారిటీ ఉందని బీజేపీ నేతలు అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ ప్రధానులు వస్తుంటే జనం భయంతో వణికిపోయేవారని, ఇప్పుడు మోదీ వస్తుంటే.. బీజేపీయేతర రాష్ట్రాల్లో అదే పరిస్థితి నెలకొందన్నారు. ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ.. దేశ ప్రధాని అబద్ధాలు, అవాస్తవాలు మాట్లాడటం తగదని, కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేని దద్దమ్మ మోదీ అని అన్నారు.