TS Land Prices రియల్ రాజకీయం
ABN , First Publish Date - 2023-06-13T02:35:56+05:30 IST
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ ప్రాజెక్టులతో పరోక్షంగా అనుసంధానమైపోయింది! రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సరే.. అక్కడ అంగుళం భూమి ధర పెరగాలన్నా, తగ్గాలన్నా అంతా సర్కారీ పెద్దల, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే.
ప్రభుత్వ పెద్దల నియంత్రణలో భూముల ధరలు
ధరలు పెరిగే అవకాశం ఉన్న భూములపై కన్ను
కొత్త ప్రాజెక్టులు వచ్చే చోట ముందే సన్నద్ధం
బినామీలు లేదా తమవారితో కొనుగోళ్లు షురూ
అన్ని ప్రాజెక్టుల్లో సొంత ప్రయోజనాలే లక్ష్యం
అభివృద్ధి మాటున సర్కారీ పెద్దల సొమ్ము దందా
కొనుగోలు చేయడానికి ఎవరూ పెద్దగా ఇష్టపడని 111 జీవో పరిధిలోని భూముల ధరలు మొదట్లో తక్కువగానే ఉండేవి. కానీ, ఇటీవల ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయగానే అక్కడ భూముల ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. కానీ, వాస్తవంగా జరిగిందేంటంటే.. ఆ జీవో రద్దవుతుందని తెలిసిన చాలామంది ‘పెద్దలు’, అధికారపార్టీ రాజకీయనాయకులు తక్కువ ధరకు దొరికినప్పుడే అక్కడి భూముల్ని పెద్దఎత్తున (వందలాది ఎకరాలు) కొనిపెట్టుకున్నారు. ఎకరం రూ.కోటి చొప్పున వారు కొన్న భూమి.. ఇప్పుడు ఎకరం రూ.10 కోట్లయింది!!
అది ఒక రియల్‌ఎస్టేట్ సంస్థ. హైదరాబాద్‌కు సమీప ప్రాంతంలో 4 వేల ఎకరాలు కొనుగోలు చేసింది. ఆ తర్వాత కొంత కాలానికే ప్రభుత్వం అక్కడో ప్రాజెక్టును అనౌన్స్ చేసింది. దాంతో ఆ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. చూడ్డానికి ఇదంతా సాఫీగా కనపడుతుందిగానీ.. వాస్తవానికి అక్కడ జరిగింది రివర్స్. అక్కడ ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిన కొందరు ప్రభుత్వ పెద్దలు.. భూములు కొనుగోలు చేయాలంటూ సదరు సంస్థ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. కొసమెరుపు ఏంటంటే.. ప్రభుత్వ పెద్దల బినామీలు ఆ సంస్థలో భాగస్వాములు.
వికారాబాద్ జిల్లా నవాబుపేట, మోమిన్‌పేట మండలాల పరిధిలో ఇండస్ట్రీ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,200 ఎకరాలను సేకరించింది. కానీ దానికి మూడేళ్ల ముందే.. ఈ భూమి చుట్టూ పలు కార్పొరేట్ నిర్మాణ సంస్థలు ఒక్కొక్కటీ 300 నుంచి 500 ఎకరాల దాకా కొనుగోలు చేశాయి. ఇండస్ట్రీ పార్కు వస్తుందన్న ప్రకటనతో.. ఆ భూముల్లో వారు భారీ వెంచర్లు వేసి జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు.
..ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు ఉదాహరణలు. పాలకులు మారారుగానీ.. పద్ధతులేవీ పెద్దగా మారలేదు. ప్రాంతేతరుల దోపిడీ పోయిందని సంబురపడినంతసేపు పట్టలేదు.. ప్రాంతంవాళ్లూ అదే పనిచేస్తున్నారని తెలుసుకోవడానికి!!
(హైదరాబాద్-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ ప్రాజెక్టులతో పరోక్షంగా అనుసంధానమైపోయింది! రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సరే.. అక్కడ అంగుళం భూమి ధర పెరగాలన్నా, తగ్గాలన్నా అంతా సర్కారీ పెద్దల, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే. వారి నియంత్రణలోనే!! భూముల ధరలు పెరగడానికి ముందే ఆ ప్రాంతంలోని భూములను తమ ఆధీనంలోకి తీసుకోవడం, తర్వాత వాటి విలువ పెరిగే విధంగా నిర్ణయాలను తీసుకోవడం.. ఆ భూములకు సంబంధించిన వివాదాలేవైనా ఉంటే వాటిని సాకుగా చూపి కొంత మేర స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణమైంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో.. ఈ తొమ్మిదేళ్ల కాలంలో.. రాష్ట్రంలోని విలువైన భూములన్నీ ప్రభుత్వ పెద్దల, అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లాయి. వారి చేతుల్లోకి వెళ్లక ముందు సాధారణ స్థాయిలోనే ఉన్న ఈ భూముల ధరలు ఆ తర్వాత అమాంతం పెరిగిపోయాయి. భూముల ధరలు పెరిగే చోట బినామీలతో కుదరకపోతే తమవారితో కొనిపించడం లేదా ముందే భూములు కొనిపించి, ఆపై వాటి ధరలు పెరిగేలా నిర్ణయాలు తీసుకోవడం.. లేదా రియల్ వ్యాపారులకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకుని, అందుకు బదులుగా కొంత భూమిని వారి నుంచి తీసుకోవడం.. ఇదీ జరుగుతోంది. ఉదాహరణకు.. హైదరాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన నానక్‌రాం గూడ, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగ్, కోకాపేట వంటిచోట్ల 100 అడుగుల రోడ్డు ఉంటేనే ఆకాశహర్మ్యాలు కట్టేందుకు అనుమతిస్తారు.
ఆ 100 అడుగుల రోడ్డుకు అనుమతి రావడం అంతకష్టమేమీ కాదు. ప్రభుత్వంలో ఉన్న కొంత మంది పెద్దలకు ఆ భూమిలో అర ఎకరం నుంచి ఎకరం మేర జాగా ఇస్తే చాలు. రోడ్డు మంజూరైపోతుంది. ఆపై ఆకాశహర్మ్యాలు కట్టుకుని సామాన్యులకు భారీ ధరలకు ఆయా ఫ్లాట్లను అంటగట్టొచ్చు. కొంతమంది పెద్దలైతే.. ‘భూమి మాకెందుకు?’ అంటూ సదరు ఆకాశహర్మ్యాల్లో కొన్ని ఫ్లాట్లు డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు. ఐటీ కారిడార్ ప్రాంతంగా పేరొందిన హైదరాబాద్‌కు పశ్చిమ ప్రాంతంలో ప్రభుత్వం ఇటివలే కొంత మంది బడా రియల్‌ఎస్టేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రజాప్రయోజనల పేరుతో ఇలా వంద అడుగుల రోడ్డు నిర్మాణానికి అనుమతులిచ్చింది. ఈ రోడ్డు నిర్మాణంతో ఆ ప్రాంతంలోని రియల్టర్లకు భారీ ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. నిజానికి అక్కడ 100 అడుగుల రోడ్డు వేయాలన్న ప్రతిపాదనలు గతంలో లేవు. కానీ రియల్‌ఎస్టేట్ బూమ్ కోసమే ఆ రోడ్డును నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ భూముల చుట్టూ..
భూముల ధరలు అసహజంగా పెరిగిపోయే ఈ దందాలో ప్రధానంగా స్ధిరాస్తి వ్యాపారులు, రియల్‌ఎస్టేట్ సంస్ధలు, రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, సినీ రంగ ప్రముఖులదే కీలకపాత్ర. వీరు ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై దృష్టి సారిస్తారు. ఆ భూములకు చుట్టూ ఉండే భూములను రైతుల నుంచి చాలా తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. భూములన్నీ వారి వారి చేతుల్లోకి మారాక ఆ భూముల ధరలు అమాంతంగా పెంచేస్తారు. అప్పటికీ పరిస్థితులు వారికి అనుకూలంగా లేకపోతే.. అక్కడ భారీగా పరిశ్రమలు, కార్పోరేట్ సంస్థలు, ఫార్మా కంపెనీలు, రింగురోడ్డు వంటివి వస్తాయని వస్తుందని ప్రభుత్వ పెద్దల ద్వారా ప్రకటనలు చేయిస్తారు. ఉదాహరణకు.. హైదరాబాద్ శేరిలింగంపల్లి సమీపంలోని వట్టినాగులపల్లి పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రాష్ట్రంలోనే పేరొందిన కొన్ని నిర్మాణ సంస్థలు కొంత కాలం కిందట అక్కడ తక్కువ ధరకే వందల ఎకరాలు భూములు కొనుగోలు చేశాయి. ఆ తర్వాత.. శేరిలింగంపల్లి, శంకర్‌పల్లి, పటాన్‌చెరు మండలాల పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం బహుళ అంతస్తుల్లో వేల అపార్ట్‌మెంట్లు వచ్చాయి. వాటి నిర్మాణం పూర్తయి దాదాపు మూడేళ్లవుతున్నా.. లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. కానీ.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనేసిన ప్రైవేటు రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ ప్రభుత్వ నిర్మాణాలను చూపి.. ఆకాశహర్మ్యానాలు, అపార్ట్‌మెంట్లు భారీ సంఖ్యలో నిర్మిస్తున్నాయి. ఒక్కో ఫ్లాట్‌నూ రూ.2.5 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల దాకా విక్రయిస్తున్నాయి.
‘111’ భూముల్లో ప్రముఖులే ఎక్కువ
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న మొయినాబాద్, శంకర్‌పల్లి, చేవెళ్ల, గండీపేట, శంషాబాద్, షాద్‌నగర్, షాబాద్ మండలాల్లోని 84 గ్రామాలు.. 111 జీవో పరిధిలో ఉండడంతో ఇటీవలి దాకా అక్కడి భూములకు పెద్దగా ధరలు పలకలేదు. అక్కడ భూములు తక్కువ ధరకే వస్తుండడంతో సాధారణ రేట్లకే రాజకీయ నేతలతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణలు చేపట్టే సంస్థలు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి కమెడియన్ వరకూ, విలన్ పాత్రధారుల నుంచి హీరోల దాకా అక్కడ భూములు కొనుగోలు చేసిన వారి జాబితాలో ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ తదితర ఉన్నతాధికారులకూ అక్కడ భూములున్నాయి. 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాల్లో దాదాపు 1.32 లక్షల ఎకరాల భూమి ఉండగా.. అందులో గ్రామ కంఠం, ప్రభుత్వ భూములు, చిన్న, సన్న కారు రైతుల భూములు పోను, దాదాపు 70 వేల ఎకరాలు ఇలా పెద్దోళ్ల చేతుల్లోనే ఉన్నాయని అంచనా. 111 జీవో ఎత్తివేతపై ముందస్తు సమాచారం ఉన్న కొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు అక్కడ వందల ఎకరాల భూములు కొనుగోలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్సీకి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములున్నాయి. గత ఏడాది ఒక ఎంపీ అక్కడ వందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ ఏడాదిలోను అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు పదుల ఎకరాల నుంచి వందల ఎకరాలు కొన్నారు. 111 జీవో ఎత్తివేతపై దాదాపు రెండేళ్ల క్రితమే వీరికి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.
త్రిబుల్ ఆర్ చుట్టూ నయా దందా..
ప్రస్తుతం రాష్ట్రంలో రియల్‌ఎస్టేట్ బూమ్ త్రిబుల్ ఆర్ (రీజనల్ రింగ్ రోడ్డు) చుట్టూ కొనసాగుతోంది. త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు రెండు సంవత్సరాల కిందటే ప్రకటించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఆగస్టు 29న త్రిబుల్ ఆర్‌ను మంజూరు చేయాలంటూ కేంద్ర మంత్రికి లేటర్ రాశారు. అప్పటి నుంచి ఈ రోడ్డుకు ఇరువైపులా సంగారెడ్డి, మెదక్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, చౌటుప్పల్, కంది, శంకర్‌పల్లి, చేవెళ్ల, నవాబుపేట, షాబాద్, షాద్‌నగర్, అమన్‌గల్, కందుకూరు తదితర మండలాల పరిధిలోని వేల ఎకరాల భూములను బహుళ జాతి నిర్మాణ సంస్థలు కొనుగోలు చేశాయి. వీటితో పాటు రాజకీయనేతలు కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అప్పట్లో వీరంతా సాధారణ రేట్లకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆ భూములు కోట్లలో ధర పలుకుతున్నాయి. వీరి దందాలతో భూముల ధరలు చుక్కలనంటుతుండడంతో సామాన్యుడు జానెడు జాగా కొనలేక సతమతమవుతున్నాడు! పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో.. సొంత పాలకుల తీరుతో సగటు తెలంగాణవాసి గోస పడుతున్నాడు!
ఫార్మా సిటీ చుట్టూ..
రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాల్లో 2016-17 ప్రాంతంలో దాదాపు 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మాణానికి భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 14 వేల ఎకరాల వరకు భూమిని సేకరించింది. అయితే.. అంతకు ముందే ఓ మాజీ ఎమ్మెల్యే మరో ఇద్దరు కలిసి అక్కడ ఎకరా రూ.1.5 లక్షల చొప్పున 250 ఎకరాలు కొనుగోలు చేశారు. ఫార్మా సిటీనిర్మాణం కోసం భూ సేకరణ సమయంలో వారు ఆ 250 ఎకరాలనూ ప్రభుత్వానికి అప్పగించారు. ఎకరాకు దాదాపు రూ.9 లక్షల వరకూ పరిహారం కింద తీసుకున్నారు. అలాగే.. ఈ ఫార్మా సిటీ నిర్మాణం చేపట్టక ముందే కొన్ని నిర్మాణ సంస్థలు కడ్తాల్, మక్తమాదారం, తాక్రాజ్‌గూడ గ్రామాల పరిధిలో వేల ఎకరాలు కొనుగోలు చేశాయి. వాటిలో విల్లాలు నిర్మించి విక్రయిస్తూ కోట్లాది రూపాయలు గడించాయి. కానీ.. అమన్‌గల్, మల్లేపల్లి, మూర్తుజపల్లి ప్రాంతాల్లో 3, 4 సంవత్సరాలపాటు ఒక ఊపు ఊపేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు మందగించింది.
యాదగిరిగుట్ట చుట్టూ
యాదగిరి గుట్టలో గుడి నిర్మాణం పేరుతో గత మూడేళ్లుగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్ బాగా పుంజుకుంది. ఆలయ నిర్మాణం పనులు మొదలు పెట్టకు ముందే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఒక ఎమ్మెల్సీ కొంత మంది నాయకులతో కలిసి అక్కడ 1000 ఎకరాలకు పైగా భూములు కొన్నారు. యాదాద్రి గుడి నిర్మాణం పూర్తయితే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు వస్తారని, ఆ ప్రాంతం అంతా మరో తిరుపతిగా మారుతుందని ఊదరగొట్టారు. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లింది. అదే అదనుగా రియల్టర్లు అవసరాలకు మించి లే అవుట్లు వేయడంతో.. వ్యాపారం ఢమాల్ అంది. దాదాపు ఏడాదిన్నర కిందట అక్కడ గజం విలువ రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పలికిన ధరలు ఇప్పడు నేల చూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు తల్చుకుంటే.. ఆ భూములు నగరానికి దూరంగా ఉన్నా, సాధారణ ప్రజలకు ప్రయోజనం లేకపోయినా, సాగుకు ఆమోదయోగ్యం కాకపోయినా ఆయా ప్రాంతాల్లో రియల్ బూమ్ సృష్టించి, సొమ్ములు దండుకుని మాయమైపోతారనడానికి నిదర్శనం ఈ ఉదాహరణ. అక్కడ ఏడాదిన్నర క్రితం భూములు కొన్న సామాన్యులు.. కొన్న ధరకన్నా తక్కువకు భూములు అమ్ముదామన్నా కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదంటూ వాపోతున్నారు.