Majlis X BJP : నా ఏరియాలో సభ పెట్టేంత ధైర్యముందార?
ABN , First Publish Date - 2023-02-17T03:21:46+05:30 IST
‘‘నా ఏరియాలోనే సభ పెట్టేంత ధైర్యముందారా?’’ అంటూ మజ్లిస్ పార్టీకి చెందిన రమ్నా్‌సపుర కార్పొరేటర్ బీజేపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. సమావేశాన్ని నిలిపివేయాలంటూ దుర్భాషలాడారు.
బీజేపీ నేతలపై మజ్లిస్ కార్పొరేటర్ వీరంగం
కార్నర్ మీటింగ్ అడ్డగింత.. బీజేపీ ఆగ్రహం
కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన
కార్పొరేటర్‌పై కేసు పెట్టాలని డిమాండ్
విచారణ జరిపి, చర్యలు తీసుకుంటాం:డీసీపీ
మదీన, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): ‘‘నా ఏరియాలోనే సభ పెట్టేంత ధైర్యముందారా?’’ అంటూ మజ్లిస్ పార్టీకి చెందిన రమ్నా్‌సపుర కార్పొరేటర్ బీజేపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు. సమావేశాన్ని నిలిపివేయాలంటూ దుర్భాషలాడారు. అక్కడి కుర్చీలను చెల్లాచెదురు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సభను అడ్డుకున్న మజ్లిస్ శ్రేణులపై చర్యలు తీసుకోకుండా.. తమపట్ల దురుసుగా ప్రవర్తించారంటూ బీజేపీ నేతలు పోలీ్‌సస్టేషన్‌లో ఆందోళన చేపట్టారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బీజేపీ ‘ప్రజాగోస’ కార్యక్రమంలో భాగంగా పాతనగరానికి చెందిన నేతలు గురువారం రాత్రి 8 గంటల సమయంలో బహదూర్‌పుర నియోజకవర్గం పరిధిలోని రమ్నా్‌సపుర డివిజన్.. మోచీకాలనీలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రమ్నా్‌సపుర కార్పొరేటర్(మజ్లిస్) అబ్దుల్ ఖాదర్ అక్కడకు వచ్చి సభను అడ్డుకున్నారు. ‘‘నా ఏరియాలో సభ పెట్టేంత ధైర్యముందారా?’’ అంటూ దుర్భాషలాడారు. బీజేపీ నేతలు కౌడి మహేందర్, నందరాజ్‌పైకి దూసుకెళ్లారు. అక్కడే ఉన్న పోలీసులు.. బీజేపీ నేతలను అడ్డుకున్నారు. ‘‘మా బస్తీలో మేం సభ ఏర్పాటు చేసుకుంటే ఇదేం దౌర్జన్యం? మీటింగ్‌ను అడ్డుకుంటే.. మీరేం చేస్తున్నారు?’’ అంటూ బీజేపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
దీంతో పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుంటుండగా.. కార్యకర్తలు అడ్డుపడ్డారు. ‘‘మీటింగ్‌ను అడ్డుకున్న మజ్లిస్ కార్పొరేటర్‌ను కాకుండా.. మా నాయకులను ఎందుకు అరెస్టు చేస్తున్నారు’’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత బీజేపీ నేతలు, కార్యకర్తలు స్థానిక కాలాపత్తర్ పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని, ఠాణాలో ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న దక్షిణ మండలం డీసీపీ చైతన్య అక్కడకు చేరుకుని, బీజేపీ నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సభను అడ్డుకున్న మజ్లిస్ కార్పొరేటర్‌పై కేసులు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై డీసీపీ స్పందిస్తూ.. ‘‘విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పోలీసుల దురుసు ప్రవర్తన ఆరోపణలపైనా విచారణ జరుపుతాం. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’’ అని హామీ ఇచ్చారు. సంబంధిత పోలీసులకు వెంటనే షోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పారు. దీంతో బీజేపీ నేతలు శాంతించి, ఠాణా నుంచి వెనుదిరిగారు.