Medical seat: మెడికల్‌ సీట్లు మిగిలిపోతున్నాయ్‌!

ABN , First Publish Date - 2023-07-31T02:13:43+05:30 IST

వైద్య విద్యలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎంతో కష్టపడుతుంటారు. పగలనకరేయనకా చదివి, పరీక్షలు రాస్తుంటారు. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు చాలా పోటీ కూడా ఉంటుంది.

Medical seat: మెడికల్‌ సీట్లు మిగిలిపోతున్నాయ్‌!

ఏటా 4 వేలకు పైగా పీజీ సీట్లు, 300 వరకు ఎంబీబీఎస్‌ సీట్లు ఖాళీ

కౌన్సెలింగ్‌ ప్రక్రియ లోపభూయిష్టం

పీజీలో మిగిలేవన్నీ నాన్‌ క్లినికల్‌ సీట్లే

హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో ప్రవేశాల కోసం విద్యార్థులు ఎంతో కష్టపడుతుంటారు. పగలనకరేయనకా చదివి, పరీక్షలు రాస్తుంటారు. వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు చాలా పోటీ కూడా ఉంటుంది. అలాంటి వైద్యవిద్య సీట్లు దేశంలో ఏటా భారీ సంఖ్యలో మిగిలిపోతుండడం గమనార్హం. ము ఖ్యంగా పీజీ వైద్య సీట్లు ఏడాదికి సగటున 4 వేలు మిగిలిపోతుండగా, యూజీ సీట్లు మాత్రం 300లోపే ఉంటున్నాయి. ఆ వివరాలను తాజాగా జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వెల్లడించింది. వైద్య విద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించిన నియమ నిబంధనలను ఎన్‌ఎంసీ సరళతరం చేయడంతో 2014 నుంచి ఏటా దేశంలో వైద్య కళాశాలల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఫలితంగా ఎంబీబీఎస్‌ సీట్లు పెరుగుతున్నాయి.

అలాగే ప్రస్తుతమున్న మెడికల్‌ కాలేజీల్లోని పీజీ సీట్లను పెంచుకోవడానికి కూడా నిబంధనలను సవరించారు. దీంతో పీజీ సీట్లూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశం లో 681 మెడికల్‌ కాలేజీలుండగా.. 1,07,948 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. 2020-21లో 83,275 ఎంబీబీఎస్‌ సీట్లుండగా మూడేళ్లలోనే 24,673 సీట్లు పెరిగాయి. ఇక పీజీ సీట్లు 67,802 ఉన్నట్లు ఎన్‌ఎంసీ వెల్లడించింది. యూజీ సీట్లకు సమానంగా పీజీ సీట్లను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలో స్పెషలిస్టు వైద్యుల కొరత ఉంది. దాన్ని తగ్గించాలంటే డీఎన్‌బీ కోర్సులతో పాటు పీజీ సీట్లను పెంచడం ఒక్కటే మార్గమని కేంద్రం భావిస్తోంది. మూడు నాలుగేళ్లలో యూజీకి సమానంగా పీజీ సీట్ల సంఖ్యను పెంచనుంది.

భారీగా మిగులుతున్న పీజీ సీట్లు

పీజీ సీట్లు ఏటా భారీగా మిగిలిపోతున్నట్లు కేంద్రం వెల్లడించింది. 2022-23లో 6.8 శాతం (4,400) పీజీ సీట్లు మిగిలిపోయాయి. పీజీలో క్లినికల్‌లో సుమారు 20 వరకు సబ్జెక్టులుంటే, నాన్‌ క్లినికల్‌లో 8 విభాగాలుంటాయి. ప్రస్తుతం క్లినికల్‌ సబ్జెక్టులకున్న డిమాండ్‌ నాన్‌ క్లినికల్‌కు లేదు. దీంతో ఆయా విభాగాల్లో చేరేందుకు వైద్య విద్యార్థులు ఆసక్తి చూపకపోవడమే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిగిలిపోతున్న పీజీ సీట్లలో 99 శాతం నాన్‌ క్లినికల్‌ విభాగాలవే ఉన్నాయి. మరోవైపు కౌన్సెలింగ్‌ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండటంతోనే యూజీ, పీజీ సీట్లు మిగిలిపోతున్నాయని వైద్యవిద్య నిపుణులు చెబుతున్నారు.

Updated Date - 2023-07-31T03:10:15+05:30 IST