Railway project : మెట్రో ముద్దు.. ఎంఎంటీఎస్ వద్దా?
ABN , First Publish Date - 2023-08-31T01:20:23+05:30 IST
రైల్వే ప్రాజెక్టుల పనులపై తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు తామెంత సాయమందించినా పేరు రాదనే భావనతో వాటిని గాలికి వదిలేస్తోంది. దీంతో ప్రతిపాదిత పనులు ఏళ్ల తరబడి ...
రైల్వే పనులపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం
తన వాటా నిధులివ్వకుండా మౌనం
అదే మెట్రోకు భారీగా నిధుల కేటాయింపు
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రైల్వే ప్రాజెక్టుల పనులపై తెలంగాణ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. కేంద్రం ఆధ్వర్యంలో చేపడుతున్న పనులకు తామెంత సాయమందించినా పేరు రాదనే భావనతో వాటిని గాలికి వదిలేస్తోంది. దీంతో ప్రతిపాదిత పనులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి. అయితే పెండింగ్ పనులు పూర్తయి లోకల్ రైళ్లు అందుబాటులోకి వస్తే రూ.10-20 టికెట్ చార్జీతో నగరం నలుమూలలకు ప్రజలు ప్రయాణించే వెసులుబాటుండేది. అవి సుదీర్ఘకాలంగా సాగుతుండటంతో రూ.50-70 ప్రయాణ భారాన్ని నిత్యం భరించాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు అదే రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టులకు మాత్రం రూ.కోట్లాది నిధులను కేటాయిస్తోంది. రెండో దశ, మూడో దశ ప్రాజెక్టులకు వేలాది కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది.
ఎంఎంటీఎస్ పరిస్థితి ఇది..
నగరంలో ప్రజారవాణాను మెరుగుపర్చడంలో భాగంగా 2003లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు మొదటి కారిడార్ కింద ఫలక్‌నుమా-సికింద్రాబాద్-లింగంపల్లి, రెండో కారిడార్‌లో లింగంపల్లి-నాంపల్లి, మూడో కారిడార్ నాంపల్లి-సికింద్రాబాద్ మార్గాల్లో 45 కిలోమీటర్ల మేరకు పనులు చేపట్టారు. అయితే తొలి దశ విజయవంతమైన నేపథ్యంలో 2012లో రెండో దశకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్-భువనగిరి, సికింద్రాబాద్-మనోహరాబాద్, ఫలక్‌నుమా-ఉందానగర్, మౌలాలి-సనత్‌నగర్ బైపాస్ మార్గాల్లో 95 కిలోమీటర్ల వరకు విద్యుద్దీకరణ, డబ్లింగ్ పూర్తి చేసి మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. ఈ మేరకు 2012లో రూ.817కోట్ల అంచనాతో అప్పట్లో ప్రతిపాదనలు రూపొందించారు. కేంద్రం తన వాటా రూ.217 కోట్లలో ఇప్పటివరకు రూ.434 కోట్లు (ఒప్పందం కంటే ఒక వంతు అదనంగా) ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.600 కోట్లలో ఇప్పటివరకు రూ.229 కోట్లు మాత్రమే చెల్లించింది. ఇంకా రూ.371 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే తెలంగాణ సర్కారు సహకారం లేకున్నా రెండో దశలో ప్రతిపాదించిన మౌలాలి-ఘట్‌కేసర్, ఫలక్‌నుమా-ఉందానగర్, సికింద్రాబాద్-బొల్లారం, బొల్లారం-మేడ్చల్, సనత్‌నగర్-మౌలాలి, మౌలాలి-మల్కాజిగిరి, సీతాఫల్‌మండి, తెల్లాపూర్-రాంచంద్రాపురం మార్గాల్లో 96.25 కి.మీ.లో ఇప్పటివరకు 84.05 కి.మీ. మార్గాన్ని కేంద్రం పూర్తి చేసింది. ఈ మేరకు ఈ మార్గాల్లో ఈ ఏడాది ఏప్రిల్ 8న దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా రైళ్లను లాంఛనంగా ప్రారంభించారు. ఎంఎంటీఎస్ పనులను పక్కన పెట్టిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. మెట్రోకు మాత్రం వేలాది కోట్లను నిధులను కేటాయిస్తోంది. ఈ మేరకు రెండో దశలోని ప్రతిపాదిత రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోకు సొంతంగా రూ.6,250 కోట్లు మంజూరు చేసింది. అలాగే మెట్రో మూడో దశలో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ మెట్రో రైలు నిర్మాణం కోసం ఏకంగా రూ.69 వేల కోట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.
మండిపడుతున్న విపక్ష నేతలు..
ఎంఎంటీఎ్‌సను గాలికి వదిలేయడం, మెట్రోకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంపై విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. ఎంఎంటీఎస్ రెండో దశలో ఉందానగర్ వరకు ట్రాక్‌నిర్మాణం పూర్తయిందని, అక్కడి నుంచి ఎయిర్‌పోర్టు వరకు కొత్త లైన్ వేస్తే సికింద్రాబాద్ నుంచి కేవలం రూ.30చార్జీతో శంషాబాద్ వరకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, రాష్ట్రం తన వాటాను చెల్లిస్తే రెండు, మూడు ఎంఎంటీఎస్ రైళ్లను కొనుగోలు చేసి రెండో దశలో ఇప్పటికే పూర్తయిన మార్గాల్లో నడిపించవచ్చని అధికారులు చెబుతున్నారు.